నల్లగొండ, జూన్ 21: కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని…ప్రజలకు విషయాన్ని వివరిస్తూ వారిని చైతన్యపర్చి కాంగ్రెస్ నేతలను నిలదీసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైన నేపథ్యంలో ఆ పార్టీపై ఎంతో వ్యతిరేకత వచ్చిందని..ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతూ ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 16 నెలలు అవుతున్నా వాటి అమలు చేయటంలో విఫలమైందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలతోపాటు పట్టణ ప్రాంతాల్లో కౌన్సిలర్లు సైతం బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారనే ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, తిప్పర్తి, కనగల్, నల్లగొండ పార్టీ అధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, కరీంపాష, నారబోయిన బిక్షం, తండుసైదులు గౌడ్, తుమ్మల లింగస్వామి, వంగాల సహదేవ రెడ్డి, దోటి శ్రీనివాస్, సింగం రామ్మోహన్, కొండూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.