సూర్యాపేట, మే 31 (నమస్తే తెలంగాణ)/నల్లగొండ : ఎండలు భగభగ మండుతున్నాయి. వర్షాలతో కొన్ని రోజులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించినా మళ్లీ భానుడు విజృంభిస్తున్నాడు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో అత్యధికంగా 46.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో 46.4, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో 46.3 డిగ్రీలు రికార్డయ్యింది. ఉదయం పదిన్నర గంటలకే 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మధ్యాహ్నం అయితే ఎండ తీవత్రతోపాటు వడగాలులు జనాలను బయటకు అడుగు పెట్టనివ్వడం లేదు.
సాయంత్రం అయినా వేడిమి తగ్గడం లేదు. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. కొబ్బరిబొండాలు, శీతలపానీయాలు, నిమ్మ సోడాలకు గిరాకీ పెరిగింది. పెరిగిన ఎండలతో కూలీలు, రైతులకు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, ఉదయం, సాయంత్రం మాత్రమే పనులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో ఐదారు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
యాదాద్రి జిల్లా వలిగొండలో 46.3, యాదగిరిగుట్టలో 45.9 డిగ్రీలు, మోత్కూరు బుజిలాపురంలో 44.3, ఆలేరు గొలనుకొండలో 44.2, మోటకొండూరులో 43.8, సంస్థాన్‌నారాయణపురం జనగాంలో 43.6, చౌటుప్పల్ తూప్రాన్‌పేటలో 43, అడ్డగూడూరు, భువనగిరి నందనం, గుండాలలో 42.7, భూదాన్‌పోచంపల్లి జలాల్‌పురంలో 42.6, ఆత్మకూరు (ఎం)లో 42.5, రామన్నపేట ఎల్లంకిలో 42.3, బీబీనగర్ వెంకిర్యాల, బొమ్మలరామారం మర్యాలలో 42.2, రాజాపేటలో 42, తుర్కపల్లి(ఎం)లో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తొగర్రాయిలో 46.4, పెన్‌పహాడ్, చిలుకూరు మండలాల్లో 46.1, మఠంపల్లిలో 45.9, మోతె 45.2, అనంతగిరి 45.1, నడిగూడెం 45, సూర్యాపేటలో 44.2 డిగ్రీలు రికార్డు కాగా.. నల్లగొండ జిల్లా కేతేపల్లిలో 46.8, మిగతా మండలాల్లో 40 డిగ్రీలకు తక్కువ ఎక్కడా నమోదు కాలేదు. చిట్యాల, మునుగోడు మండలం ఊకొండిలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు.