నల్లగొండ, ఆగస్టు 14: సాగర్ నిండినా ప్రభుత్వం సమృద్ధిగా నీటిని విడుదల చేయకపోవటంతో నిన్నటి దాక ఎండిన చెరువులు నేడు వరణుడి కరుణతో జలకళను సంతరించుకున్నా యి. మిషన్ కాకతీయ పథకం కింద బీఆర్ఎస్ సర్కార్ చెరువులను పునరుద్ధరించిన విషయం విదితమే. దీంతో రెండు రోజుల్లోనే భారీ వర్షాలు పడటంతో జిల్లాలో ఇప్పటికే 65 చెరువులు మత్తడి దుంకినట్లు ఐబీ అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8గంటల నుంచి గురువారం ఉదయం 8గంటల మధ్యలో నాలుగు సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుండ్లపల్లి 85.9, చందంపేట 82.9, మిర్యాలగూడ 75.9, పీఏ పల్లి 74.9, దేవరకొండ 65.8, తిర్మలగిరి సాగర్ 61.9, నేరేడుగొమ్ము 60.0, నల్లగొండ 53.8, కొండమల్లేపల్లి 58.2, గుడిపల్లి 54.4, అడవిదేవుల పల్లి, చింతపల్లి 41.4, 39.5, వేములపల్లి 39.0, నకిరేకల్ 38.6, మాడ్గులపల్లి 37.4, కేతేపల్లి 35.9, కనగల్ 33.8, అనుముల 32.1, తిప్పర్తి 31.2, దామరచర్ల 30.6, కట్టంగూర్ 28.7,త్రిపురారం 28.5, పెద్దవూర 28.1, నాంపల్లి 27.6, శాలిగౌరారం 26.2, గుర్రంపోడ్ 24.5, నిడమనూరు 24.0, చండూరు 24.0, గట్టుప్పల్ 20.8, మర్రిగూడ 17.7, నార్కట్‌పల్లి 15.6, మునుగోడు 14.1, చిట్యాల 11.4 మి. మీ. వర్షం పడింది. మొత్తంగా ఆయా మండలాల్లో 1324.4 మి.మీ. వర్షం పడగా సగటున 40.1 మి.మీ.వర్షం పడింది.
కోదాడ, ఆగస్టు 14 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కోదాడలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కోదాడ, అనంతగిరి, చిలుకూరు మండలాల్లోని వాగులు పొంగిపొర్లుతుండగా ఇప్పటికే వేసిన నార్లు నీట మునిగాయి. కోదాడలో కురిసిన కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలైన షిరిడి సాయి నగర్, తులసీ టౌన్‌షిప్‌లోని పలు కాలనీలు జలమయయ్యాయి. తమ్మరబండపాలెం వాగు బ్రిడ్జికి సమాంతరంగా పొంగిపొర్లుతోంది. మున్సిపల్ అధికారులు అప్రమత్తమై షిరిడిసాయి నగర్, తులసీ టౌన్‌షిప్‌లోని పలువురిని ప్రొక్లెయిన్లతో తరలించారు. పాఠశాల విద్యార్థులను ఇళ్లకు పంపించారు. కోదాడ పెద్ద చెరువు పొంగడంతో అనంతగిరి, కోదాడ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హుజూర్నగర్ వెళ్లే రహదారిలో బ్రిడ్జి పొంగిపొర్లుతుండటంతో శ్రీమన్నారాయణ కాలనీవాసులు తక్షణ చర్యలు చేపట్టాలంటూ మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
కోదాడ రూరల్, ఆగస్టు14: మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కూచిపూడి, రామాపురం క్రాస్‌రోడ్డు ప్రధాన రహదారిపై ఉన్న వాగు, నల్లబండగూడెం శివారు మం గలితండా ప్రధాన రహదారిపై ఉన్న అంతర్గంగా వాగు పొంగడంతో రెండు ప్రధాన రహదారులపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పలు గ్రామాల్లో వందల ఎకరాల వరి పంట నీటి మునిగింది. మరి కొన్ని పొలాల్లో ఇసుక మేటలు వేసింది.
నేరేడుచర్ల, ఆగస్టు 14: భారీ వర్షంతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతూ ఉధృతం గా ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల పంట నీట మునగడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలకు ఇబ్బందు లు ఏర్పడ్డాయి. పెంచికల్‌దిన్న పంచాయతీ పరిధిలోని గంటవారిగూడెం-నేరేడుచర్లకు వచ్చే రహదారిపైన ఉన్న వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. సమీప పొలాలు మొత్తం నీట మునిగాయి. బక్కగూడెంలో వరద ఉధృతికి సుమారు 50 ఎకరాలు నీట మునిగింది. సోమారంలోని కుంట నిండడంతో గండిపడి సమీప పొలాలు మొత్తం నీట మునిగాయి.
మేళ్లచెర్వు, ఆగస్టు 14: వర్షాలకు నాగులచెరువు, థంసాచెరువు, కందిబండ ఊరచెరువు, రామాపురం గోపాల్‌రావు చెరు వు నిండుకుండలా మారాయి. కందిబండ శివారులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్వీసు రోడ్డు మీదుగా వరదనీరు ప్రవహించడంతో భారీవాహనాల రాకపోకలను నిలిపివేశారు. మేళ్లచెర్వు-చింతలపాలెం రోడ్డులో రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి కాంక్రీట్ దెబ్బతినడంతో బ్రిడ్జికిరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
హాలియా, ఆగస్టు 14: వర్షాలకు అనుముల మండలం పేరూరులోని సోమసముద్రం చెరువు నిండుకుండలా మారింది. చెరువు కత్వపై నుంచి వరద హాలియా వాగులోనికి చేరడంతో హాలియా-పేరూరు గ్రామాల మధ్య ఉన్న రహదారిపై ఏర్పా టు చేసిన కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో హాలియా -పేరూరు గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పేరూరు గ్రామస్తులతో పాటు ఈ రహదారి గుండా హాలియాకు వచ్చే ఆంజనేయుతండా, పుల్లారెడ్డిగూడెం, వీర్లగడ్డతండ, బోయగూడెం, చిలుకాపురం గ్రామా ల ప్రజలు వయా కోరివేనుగూడెం, అల్వాల అడ్డురోడ్డు మీదుగా హాలియాకు వస్తున్నారు.
మట్టంపల్లి, ఆగస్టు 14: భారీ వర్షాలకు రఘునాధపాలెం వెళ్లేదారిలోని కప్పలవాగు పొంగి ప్రవహించడంతో గురువారం రఘునాధపాలెం, చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలు దా టించే క్రమంలో రెండు బైకులు కొట్టుకుపోయాయి. వాగులో కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానికులు కాపాడారు.
పాలకవీడు ఆగస్టు 14:వానలకు చింతవాగు (ఉప్పరేణివాగు)ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గురువారం కల్మటితండా- జాన్‌పహాడ్ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొందరు ప్రయాణికులు ఈ రహదారిపై ప్రయాణించేందుకు యత్నింగా ముగ్గురి బైక్‌లు వరదలో కొట్టుకుపోగా, వారు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. అధికారులు, పోలీసులు రహదారిపై వంతెన వద్ద జేసీబీతో పూడిక పనులు చేపట్టారు.
డిండి, ఆగస్టు 14: డిండి ప్రాజెక్టు అలుగుపోస్తోంది. 36 ఫీట్ల ఎత్తు ఉన్న డిండి ప్రాజెక్టు 2.45 టిఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిండడంతో ప్రాజెక్టు నుంచి నీరు అలుగుపారుతోంది.