మిర్యాలగూడ, ఆగస్టు 26 : 14 ఏండ్లపాటు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గత పదేండ్లుగా వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం కింద 300 మంది లబ్ధిదారులకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతులను సంపన్నులను చేయాలనే లక్ష్యంతో పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారని, ఈ పథకంతో రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది రైతులకు రూ.76 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు పాటుపడుతున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావును మూడోసారి గెలిపించి మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు దొంగ వేషాలు వేస్తూ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారని, వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం కేసీఆర్ అని, కాంగ్రెస్, బీజేపీలు వారి సీఎం అభ్యర్థులు ఎవరో దమ్ముంటే ప్రకటించాలని సవాల్ చేశారు. అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వానికి ప్రజలంతా మూడోసారి అండగా నిలువాలని కోరారు. ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మోసిన్‌అలీ, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ విష్ణు, ఎంపీపీలు నందిని, నూకల సరళ, బాలాజీనాయక్, జడ్పీటీసీలు మంగమ్మ, లలిత, నాయకులు పాల్గొన్నారు.