ఉమ్మడి రాష్ట్రంలో విద్యను గాలికొదిలేశారు. మొత్తం రాష్ట్రం లోనే కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రభుత్వ విద్య దశ దిశ మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏకంగా 25 బీసీ గురుకులాలు, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు, నల్లగొండ జిల్లాలో 14, సూర్యాపేట జిల్లాలో 8 గురుకులాలు ఉన్నాయి. వీటిలో 16,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు బీసీ గురుకురాలను మంజూరు చేసింది. ఒక్కో జిల్లాకు ఒకటి చొప్పున కేటాయించింది. ఒక్కో గురుకులంలో 420 మంది విద్యార్థులు కొత్తగా చేరనున్నారు.
– యాదాద్రి భువనగిరి ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)
యాదాద్రిలో ఐదుకు చేరిన బీసీ గురుకులాలు
ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు బీసీ గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో 2,240 మంది విద్యార్థులు చదువుతున్నారు. మోటకొండూర్, పోచంపల్లిలో పదో తరగతితోపాటు ఇంటర్ కూడా నడుస్తున్నది. ఇక్కడ 960 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక బీబీనగర్, రాజాపేటలో 10వ తరగతి వరకు నడుస్తున్నది. వీటిల్లో 1280 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్తగా మంజూరైన దానితో కలిపి గురుకులాల సంఖ్య ఐదుకు చేరింది. భువనగిరి మండలంలోని అనంతారంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా నడుస్తున్నది.
సెప్టెంబర్ వరకు అడ్మిషన్లు
మూడు కొత్త గురుకులాలు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ వరకు అడ్మిషన్ ప్రక్రియ ముగియనుంది. వీటిలో తొలుత 5,6,7 తరగతులు ప్రారంభంకానున్నాయి. ఆ తర్వాత ఏటా ఒక్కో తరగతి అప్ గ్రేడ్ కానున్నది. 2019లో మూడు గురుకులాలకు పర్మిషన్ ఇచ్చి నడిపిస్తున్నారు. కొత్త గురుకులాలు ప్రస్తుతం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయనున్నారు.
సాగర్‌లో కొత్తగా బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం జీఓ విడుదల చేశారు. ఇందులో నాగార్జునసాగర్‌లో బీసీ గురుకుల డిగ్రీ కళాశాల మంజూరు చేసింది. దీంట్లో కొత్త కోర్సులు కూడా పెట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. గతంలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలోనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మంజూరు చేశారు. దాంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు జిల్లాకు గురుకుల పాఠశాల కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లాకు మరో బీసీ గురుకుల పాఠశాల రావడంతో విద్యార్థులకు మరింత మేలు జరుగుతుంది. బీసీ విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులకు గురై మధ్యలోనే చదువును నిలిపివేస్తున్నారు. జిల్లాలో బీసీ విద్యార్థుల సంఖ్య పెరుగడంతో సీట్లు అందరూ పొందలేక పోతున్నారు. ప్రస్తుతం మరో బీసీ గురుకుల రావడంతో కొంత మందికి లబ్ధి కలుగనున్నది.
విద్యకు పెద్దపీట
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యకు పెద్ద పీట వేస్తున్నది. విద్యార్థుల బాగోగులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నది. పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసింది. స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నది. విదేశీ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సర్కిళ్లను నెలకొల్పింది. హాస్టళ్లలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నది.
గురుకులాలల్లో సకల సదుపాయాలు
దేశంలోనే గురుకులాలు అంటేనే తెలంగాణ గుర్తుకొచ్చేలా ప్రభుత్వం సొసైటీలను తీర్చిదిద్దింది. నిధులకు వెనుకాడకుండా ఎప్పటికప్పుడు సమకూరుస్తున్నది. గురుకులాల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నది. ఏటా ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయలకుపైనే ఖర్చు చేస్తున్నది. విశాలమైన బిల్డింగుల్లో వసతి ఏర్పాటు చేసింది. నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నది. యూనిఫామ్, వాచ్‌లు, బ్లాకెంట్లు, జాకెట్లు, ట్రాక్ షూస్, బుక్స్, కాస్మొటిక్ చార్జీలు ఇస్తున్నది. డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి వాటర్ హీటర్లను అందుబాటులోకి తెస్తున్నది. ఇన్ని సదుపాయాలు ఉండడంతో తల్లిదండ్రులు సైతం గురుకులాల్లో చదివించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వందల సీట్లకు లక్షల మంది పోటీ పడుతున్నారు. పైరవీలు చేయించుకుంటూ సీటు పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటే గురుకులాలు ఎంత అద్భుతంగా నడుస్తున్నాయో అర్థమవుతుంది.