– ఈ రోజు బాధితులకు రూ.20 లక్షల విలువైన 102 మొబైల్ ఫోన్ల అందజేత
సూర్యాపేట టౌన్, నవంబర్ 11 : ప్రతి నెల సూర్యాపేట జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్ రికవరీ మేళాలో వివిధ రూపాల్లో ప్రజలు పోగొట్టుకున్న 102 ఫోన్లను రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేసి మాట్లాడారు. ఈ సంవత్సరం 7వ దఫా మొబైల్ మేళా నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్ ను బాధితులకు అందించినట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 2,340 మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. మంగళవారం రూ.20 లక్షల విలువైన 102 మొబైల్స్ బాధితులకు అందించినట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సైబర్ వారియర్స్ నిరంతర శ్రమ ఫలితంగానే ఈ 102 మొబైల్ నేడు బాధితులు అందించగలిగామన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతున్నారు. సైబర్ మోసానికి గురై ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు.
పోయిన మొబైల్స్ ను గుర్తించడానికి CEIR పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరిగిందని వివరించారు. ఎవరైనా తమ మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు నమోదు చేసుకోవాలని, మొబైల్ ను బ్లాక్ చేసి, మీ సేవా ద్వారా ధరఖాస్తు సంభందిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు, వినియోగదారులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకవనుకున్న బాధితులు జిల్లా ఎస్పీ, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్స్ రికవరీలో విశేష కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రైతులు ధాన్యాన్ని రోడ్లపై అరబోయవద్దని ఎస్పీ అన్నారు. ప్రయాణ సమయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ తప్పక ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డి సి ఆర్ బి డీఎస్పీ రవి, స్పెషల్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఐ టి కోర్ ఆర్ ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు.

Suryapet Town : సి.ఈ.ఐ.ఆర్ ద్వారా ఇప్పటివరకు 2,340 మొబైల్ ఫోన్స్ రికవరీ : ఎస్పీ నరసింహ