ఆదివారం 07 మార్చి 2021
Nalgonda - Jan 18, 2021 , 01:24:05

‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396

‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396

  • ఖరారైన తుది జాబితా
  • నేడు అధికారికంగా వెల్లడి
  • అత్యధికంగా నల్లగొండలో 88351, తక్కువగా ములుగులో 9890 మంది ఓటర్లు
  • వచ్చే నెల మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్‌
  • మార్చి మూడో వారంలో పోలింగ్‌కు అవకాశం

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల తుది జాబితా ఖరారైంది. కిందటిసారితో పోలిస్తే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. మొత్తం 4,91,396 మంది ఓటర్లు నమోదయ్యారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా 546 పోలింగ్‌ స్టేషన్లు కూడా గుర్తించారు. నల్లగొండలో అత్యధికంగా 88,351 మంది, అతి తక్కువగా ములుగు జిల్లాలో 9890 మంది ఓటర్లు ఉన్నారు. 11 పూర్తి జిల్లాలతోపాటు సిద్దిపేట జిల్లాలోని మూడు మండలాలతో ఈ నియోజకవర్గం విస్తరించి ఉండగా ట్రాన్స్‌జెండర్ల ఓట్లు కూడా ఇందులో 72 ఉన్నాయి. ఫిబ్రవరి మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావచ్చని, మార్చి మూడో వారంలో పోలింగ్‌ జరుగవచ్చని అంచనా.

- నల్లగొండ ప్రతినిధి, జనవరి17(నమస్తే తెలంగాణ)

నల్లగొండ ప్రతినిధి, జనవరి17(నమస్తే తెలంగాణ): నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పాత జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం నేటితో ముగియనుంది. ఓటర్ల నమోదుకు గడువిచ్చి తర్వాత పరిశీలించి, ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించి వాటిని ఈ నెల 12వ తేదీ నాటికి పరిష్కరించారు. ఫైనల్‌గా తుది జాబితాను సోమవారం వెల్లడించాల్సి ఉంది. అందుకు సంబంధించిన తుది జాబితాను ఆదివారం సాయంత్రానికే సిద్ధ్దమైంది. నేడు  దీన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. 90 శాతం దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లోనే రాగా మిగతా పది శాతం నేరుగా ఆయా తాసీల్దార్‌ కార్యాలయాల్లో సమర్పించారు. ఓటరు నమోదు కోసం నవంబర్‌ ఆరవ తేదీ నాటికి  5,17,543 దరఖాస్తులు రాగా వీటిని నవంబర్‌ 30వ తేదీ వరకు పూర్తిస్థాయిలో పరిశీలించారు. వీటిల్లో సరైన ఓటర్‌ నమోదుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించని దరఖాస్తులను తిరస్కరించారు. డిసెంబర్‌ ఒకటి నుంచి తిరిగి తిరస్కరించిన దరఖాస్తులపై అభ్యంతరాలను స్వీకరిస్తూనే కొత్త దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఇలా మొత్తం ప్రక్రియ పూర్తై తుది జాబితా ఖరారైంది. మొత్తం 4,91,396 మంది ఓటర్లతో తుది జాబితా ఖరారైంది. ఇందులో పురుష ఓటర్లు 3,23,377 మంది, మహిళా ఓటర్లు 1,67,947 మంది, ట్రాన్స్‌జెండర్లు 72 మంది ఉన్నారు. ప్రస్తుతం 12 జిల్లాలో పరిధిలో మొత్తం 546 పోలి ంగ్‌ స్టేషన్లను కూడా నోటి ఫై చేశారు. ఈ ఓటర్ల జాబితాలో అత్యధికంగా నల్లగొండ జిల్లా నుంచి 88,351 మంది ఓటర్లు, తర్వాత ఖమ్మంలో 85, 051 మంది, వరంగల్‌ అర్బన్‌లో 64,432 మంది, సూర్యాపేటలో 60, 020 మంది, భద్రాది కొత్తగూడెంలో 41571 మంది, యాదాద్రి భువనగిరిలో 37,572 మంది, మహబూబాబాద్‌లో 35,389 మంది, వరంగల్‌రూరల్‌లో 32,835 మంది, జనగామలో 20,502మంది, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో 12,388మంది, ములుగు జిల్లాలో 9,890, సిద్దిపేట జిల్లాలోని మూడు మండలాల్లో కలిపి 3,395మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఉమ్మడిజిల్లాల వారీగా చూస్తే నల్లగొండలో 185943 మంది ఓటర్లు, ఖమ్మంలో 136512 మంది, వరంగల్‌లో 165546 మంది ఓటర్లు ఉన్నారు. 

అదనంగా 2.10లక్షల మంది ఓటర్లు

కాగా 2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 2,81,138 ఉన్నారు.. ఈ సారి అదనంగా 2.10లక్షల మంది ఓటర్లుగా నమోదుయ్యారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలుగా ఉన్న వరంగల్‌లో 1,04,364మంది, నల్లగొండలో 92,490మంది, ఖమ్మం జిల్లాలో 84,284 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో పురుషులు 2,05,180మంది, మహిళలు 75, 801 మంది, ట్రాన్స్‌జెండర్లు 158మంది ఉన్నారు. కానీ ఈ సారి మహిళల ఓట్లు రెట్టింపయ్యాయి. 2015 మార్చి 22న జరిగిన ఎన్నికల్లో ఓటర్లుగా నమోదైన వారిలో కేవలం 54.62శాతమే ఓటుహక్కును వినియోగించుకున్నారు.  మార్చి 29వ తేదీతో ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుండడడంతో అప్పటిలోగా ఎన్నికల ప్రక్రియను ముగించాల్సి ఉంది. ఈ ప్రకారం  ఫిబ్రవరి మధ్యలో నోటిఫికేషన్‌, మార్చి మూడో వారంలో పోలింగ్‌ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

VIDEOS

logo