– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య
గుర్రంపోడు, ఏప్రిల్ 17 : ఉపాధి హామీ చట్టంలో పని చేస్తున్న వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గుర్రంపోడు మండలంలోని కొత్తలపురం, చాంలేరు గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయంలోకి యంత్రాలు రావడంతో వ్యవసాయ కార్మికులకు పని దినాలు తగ్గిపోయాయని, తద్వారా ఉపాధి హామీ చట్టం తప్పా మరొక మార్గం లేదని అందుకోసమే కార్మికులను ఆదుకోవడం కోసం 200 రోజుల పని దినాలు కల్పించాలన్నారు. గత జనవరి నుండి నేటి వరకు పని చేసిన కూలీలకు వేతనాలు రాకపోవడం మూలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కార్మికులకు పని ప్రదేశంలో కనీస అవసరాలు అయినటువంటి నీరు నీడ మెడికల్ కిట్టు లాంటి సౌకర్యాలు కల్పించకపోవడం మూలంగా ఇబ్బందులు పడుతున్నారని పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. రాష్ట్రంలో 50 లక్షలకు పైగా జాబు కార్డులు ఉన్నాయని కోటి 20 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేసుకొని పని కోసం ఎదురుచూస్తున్నారని ఇందులో 10 శాతం మందికి కూడా పనులు చూపించలేక పోతున్నారని అందరికీ పని కల్పించే పద్ధతులు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు కూలీలందరికీ కల్పించడం లేదని వారానికి కొందరికి మరో వారానికి కొందరికి కల్పిస్తున్నారు. గ్రూపుల వారీగా కాకుండా గ్రామాలలో ఉన్న కార్మికులందరికీ పనులు కల్పించాలని కోరారు.
పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అణుగుణంగా రోజు కూలి రూ.800 కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలని, ముఖ్యంగా ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలనే చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే రూ.2.50 లక్షల కోట్లు కేటాయించి గతంలో మాదిరిగా వారం వారం డబ్బులు చెల్లించాలన్నారు. గొడ్డలి టెంక గడ్డపారా లాంటి పనిముట్లు అందరికీ అందించాలని, గతంలో మాదిరిగా ఉపాధిలో మేట్లను కొనసాగించాలని ఉపాధి సిబ్బందిని పర్మినెంట్ చేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విబి జీ రామ్ జీ బిల్లు రద్దుచేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించే పద్ధతుల్లో చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 నుండి మండలాల ముందు జరుగు ధర్నాలలొ పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, రైతు సంఘం జిల్లా నాయకుడు వనమాల కామేశ్వర్, సిఐటియు మండల కన్వీనర్ పగిడిమర్రి సర్వయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు రఘు, మల్లేశం, ఉపాధి కార్మిక సంఘం చామ్ లేడు గ్రామ అధ్యక్షుడు పిట్టల ప్రేమలత, కార్యదర్శి గుండెబోయిన స్వామి, కొత్తలాపురం గ్రామ అధ్యక్షుడు మెండి తిరుపతయ్య, కార్యదర్శి చామకూరి కవిత, కార్మిక సంఘం నాయకులు నడ్డి కృష్ణయ్య, చామకూరి సాగర్, పగిడిమర్రి సరిత, పగడాల అంతమ్మ, ముడుసు శిరీష, చిలువేరు బక్కయ్య, పగడాల అలివేలు, నిరసనమెట్ల చిన్నయ్య, నడ్డి కృష్ణయ్య, గుడిపల్లి సావిత్రి, నడ్డి రామలింగమ్మ, రావులపాటి ప్రశాంత్, కిలారి అయ్యన్న పాల్గొన్నారు.