రామగిరి/అడ్డగూడూరు, ఫిబ్రవరి 18 : ఏడేండ్ల కిందట జరిగిన హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ సెషన్ కోర్టు 18మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని అజీంపేట గ్రామంలో దసరా రోజున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్ట లింగయ్య హత్య జరిగింది. విచారణ జరిపిన పోలీసులు ఈ కేసులో 18మందిని నిందితులుగా పేర్కొన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నది. నిందుల్లో ఒకరు మరణించగా.. మిగతా వారికి జీవిత ఖైదీతోపాటు ఒక్కొక్కరికి 6వేల రూపాయల జరిమానా విధిస్తూ నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి, రెండో అదనపు జడ్జి ఎన్.రోజారమణి మంగళవారం తీర్పు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 2017 సెప్టెంబర్ 30 దసరా రోజున అజింపేట గ్రామానికి చెందిన బట్ట లింగయ్య జమ్మిచెట్టు వద్దకు వెళ్లి వస్తుండగా.. అప్పటి గ్రామ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య ప్రోద్బలంతో అతడి అనుచరులు కొంతమంది కులం పేరుతో బట్ట లింగయ్యను దూషించారు. జమ్మిచెట్టు వద్దకు వస్తావా? తన తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు ఆయన కుమారుడు బట్ట వెంకన్న పోలీసులు ఫిర్యాదు చేశారు. అడ్డగూడూరు పోలీసులు 18 మంది నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు తర్వాత కోర్టుకు అప్పగించారు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ఎన్.రోజారమణి తీర్పునిచ్చారు.
18 మంది నిందితులకు జీవిత ఖైదు వేశారు. నిందితుల్లో జక్కుల భిక్షమయ్య అనారోగ్యంతో ఇప్పటికే మరణించారు. మిగిలిన 17మందిని జీవిత ఖైదీతోపాటు ఒక్కొక్కరికి రూ.6వేల జరిమాన విధించారు. దాంతో పోలీసులు వారిని నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, బందోబస్తుతో జిల్లా జైలుకు తరలించారు. తీర్పు సందర్భంగా అజీంపేట గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చౌటుప్పల్ ఏసీపీ మధసూదన్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ పికెట్ ఏర్పా టు చేశారు. కోర్టు తీర్పుపై బట్ట లింగయ్య భార్య యాదమ్మ స్పందిస్తూ.. తన భర్తను హత్య చేసిన నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడడంతో తనకు న్యాయం దక్కిందన్నారు. 2012 నుంచి తాము ఐదేండ్లు ఊరికి రాలేదని, దసరా రోజున ఇంటికి వస్తే సాయంత్రం జమ్మి దగ్గర తన భర్తను అందరూ చూస్తుండగానే చంపారని వాపోయింది. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి ప్రాణభయం ఉన్నట్లు పేర్కొంది.
ఒక్కో ఇంటి నుంచి ముగ్గురు.. నలుగురు
హత్యకు గురైన బట్ట లింగయ్య అదే గ్రామంలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన పండుగ రాజమల్లును 2012 సంవత్సరంలో హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో ఐదేండ్లు జైలుకు వెళ్లిరాగా, అదే ఏడాది దసరా పండుగ రోజున లింగయ్యను హత్య చేశారు. నిందితుల్లో పండుగ రామస్వామి, పండుగ స్వామి, పండుగ రాములు, పండుగ మల్లేశ్, బండగొర్ల వల్రాజు, పండుగ యాదయ్య, జక్కుల రమేశ్, జక్కుల భిక్షమయ్య, పండుగ శ్రీకాంత్, పండుగ సతీశ్, పండుగ నర్సయ్య, పండుగ సత్యనారాయణ, బండగొర్ల నాగమ్మ, పండుగ శ్రీను, పండుగ మల్లయ్య, పండుగ లింగయ్య, జక్కుల లచ్చయ్య, పోలెబోయిన లింగయ్య ఉన్నారు. శిక్ష పడిన వారిలో ఒక్కో ఇంటి నుంచి ముగ్గురు, నలుగురు వ్యక్తులు ఉండడంతో ఆయా కుటుంబ సభ్యులు బోరున ఏడ్చారు.