ఎక్కడైనా దేవుళ్లు, దేవతామూర్తుల విగ్రహాలు ఒకటి, రెండు లేదా మూడు, నాలుగు.. మహా అయితే పది వరకు ఉంటాయి. కానీ అక్కడ ఏకంగా 16 విగ్రహాలు ఉన్నాయి. అదెక్కడనుకుంటున్నారా.. ఆ దేవుడు ఎవరనుకుంటున్నారా? సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండ గుట్టల్లో ఉన్న కాలభైరవుడు.
– చివ్వెంల, డిసెంబర్ 15
ఉండ్రుగొండ గిరి దుర్గం నిర్మాణం సుమారు ఆరు వేల ఏండ్ల పురాతనమైనదని పురావస్తు శాఖ ధ్రువీకరించింది. ఆరో శతాబ్దంలో చాణిక్యులు, 8, 9వ శతాబ్దాల్లో కళ్యాణ చాణిక్యులు, విష్ణుకుండీనులు, నాలుగు వందల ఏండ్ల తర్వాత రేచర్ల పద్మనాయకులు, రెడ్డి నాయకులు ఉండ్రుగొండను అభివృద్ధి చేసినట్లు చరిత్ర చెబుతున్నది. కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి, శ్రీకృష్ణ దేవరాయలు, కుతుబ్షాహీ, అసబ్షాహీ (గోల్కోండ నవాబులు) ఈ ప్రాంతాన్ని తమ సామంత రాజుల సహాయంతో ఏలినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. (బ్రిటీష్ ఆర్కియాలజిస్ట్ రాబర్ట్ స్టీవెల్ 1882 వాల్యూ నెంబర్ -1, పేజీ నెంబర్ 46లో ఉండ్రుగొండ గురించి రాసినట్లు ఇండోలాజికల్ బుక్హౌజ్ ఢిల్లీ వారి ప్రచురణలో పేర్కొనబడింది.)
ఉండ్రుగొండ లక్ష్మీనృసింహ ఆలయం ముందున్న కోనేరులో గజేంద్రమోక్షం తలపించు కరి – మకరుల ఆకృతులు, ఆలయం వెనుక భాగాన ఆదిశేష అవతారం, కోనేరు ఒడ్డున కూర్మావతారం, ఆలయానికి వచ్చే దారిలో ఎస్సారెస్పీ కాల్వ (జాతీయ రహదారి 65) దగ్గర నుంచి చూస్తే హిరణ్యకశపుని సంహారం, తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉన్న శయన నరసింహస్వామి, సహజ శిల్పాకృతులు ఉన్నాయి. గుహలు, ఆంజనేయ, కాలభైరవ విగ్రహాలు, కోట గోడలు, గుట్టపై నుంచి దేవాలయం వెనుక భాగం ఆనుకొని ఉన్న గుట్ట మీద వేలాడుతున్నట్టుగా ఉండే గుండ్లు (హ్యాంగింగ్ స్టోన్స్), చారిత్రక శిథిలాలు ఉన్నాయి.
మంత్రిబావి, చాకలిదాని పడిగ, సింగరేణికుంట కోనేర్లు ఇప్పటికీ నీటితో కళకళలాడుతున్నాయి. బోగందాని గద్దె, పందెంబావి, కేపీరాయినికుంట, నాయినివారి బావి, ఏనుగుల దర్వాజ, పీనుగుల దర్వాజ, నాగులపహాడ్ దర్వాజ, మల్లయ్య స్వామి గుడి, రుషుల మఠం, పహారా, గోపాలస్వామి గుడి, గుట్ట చుట్టూ 18 ఆంజనేయ స్వామి విగ్రహాలు, రామాలయ స్థలం, శంఖం, చక్రం, మూల దర్వాజ, జాలు దర్వాజ ఉన్నాయి. దేశంలో ఏ గుట్టపైనా లేని విధంగా ఈ గుట్టపైన నీరు నిల్వ ఉండడం ఇక్కడి ప్రత్యేకం. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ గుట్ట 2002లో వెలుగులోకొచ్చింది.
భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో ఆలయాలు ఉన్నాయి. ఎక్కడా లేనివిధంగా ఉండ్రుగొండలో కాలభైరవుని విగ్రహాలు నెలకొని ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసిద్ధ్ద ఉజ్జయిని, కాశీలో సైతం కాలభైరవుని విగ్రహాలు పది మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 16 విగ్రహాలు ఉండడం పరిసర ప్రాంతవాసులు అదృష్టంగా భావిస్తున్నారు. నాగాభరణంలో చెక్కబడిన రూపంలో చేతిలో బ్రహ్మ కపాలమును ధరించి తన వాహనమైన శునకముతో దర్శనమిస్తున్నాడు కాలభైరవుడు. కాలభైరవుడి ఆలయం నిర్మించి అభివృద్ధి చేయాలని ఇక్కడికి వచ్చే భక్తులతోపాటు లక్ష్మీనృసింహ ఆలయ అభివృద్ధి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆదుర్తి రామయ్య కోరుతున్నారు.