సూర్యాపేట, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. యేటా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి వారికి ఉపాధికి దోహదపడింది. కానీ కాంగ్రెస్ సర్కారు చేప పిల్లల పంపిణీ ఊసే ఎత్తడం లేదు. వర్షాకాలం ప్రారంభమైనందున ఇప్పటికే ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం సీడ్ టెండర్లు పూర్తి కావాల్సి ఉండగా దానిపై నిర్ణయం తీసుకోలేదు.
గతంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏటా సుమారు రూ.4 కోట్ల వ్యయంతో దాదాపు 950 చెరువుల్లో రూ.3.80 కోట్ల చేప పిల్లల సీడ్ ఉచితంగా అందించారు. ఈ ఏడాది కార్యక్రమం ఉన్నట్టా.. లేనట్టా అని మత్స్యకారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం వల్ల జిల్లాలో 141 మత్స్య సహకార సొసైటీల్లో 13,930 మత్స్యకారులకు లబ్ధి చేకూరనుండగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయం, దాని అనుబంధ వృత్తిదారుల్లో వెలుగులు నింపేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వ్యవసాయానికి సాగునీరుతోపాటు 24గంటల విద్యుత్, పంట పెట్టుబడి సాయం అందించింది. ఇక వ్యవసాయ అనుబంధ వృత్తులు బలపడేలా గొర్రెల పంపిణీ, సబ్సిడీపై గేదెలు, ఆవుల అందజేత, ఉచితంగా చేపల పంపిణీ చేసింది.
మిషన్ కాకతీయతో చెరువులు పటిష్టం కావడంతో జలకళ సంతరించుకొని చేపల పెంపకానికి ఎంతో తోడ్పడ్డాయి. 2016లో కేసీఆర్ సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభించగా గతేడాది వరకు నిర్విరామంగా కొనసాగింది. ఎనిమిది విడుతలుగా చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. దాంతో ఎన్నో మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి లభించింది. ఈ ఏడాది మాత్రం దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉలుకుపలుకు లేకుండా ఉండడం మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
జూన్ నెల సగం పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపల సీడ్ కోసం టెండర్లు పిలువకపోవడంతో అనుమానాలకు తావిస్తున్నది. అసలు సీడ్ పంపిణీ ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది వరకు వానకాలం సీజన్ ప్రారంభం కాకముందే చేప పిల్లల పంపిణీ కోసం ఏర్పాట్లు జరిగేవి. జూన్ ప్రారంభంలోనే టెండర్లను ఆహ్వానించి ఫైనల్ చేసేవారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే పండుగ వాతావరణంలో చెరువుల్లోకి సీడ్‌ను వదిలేవారు.
కానీ ఈ సారి మాత్రం దానికి సంబంధించిన చర్యలు ప్రారంభించలేదు. వర్షాలు కూడా కురుస్తున్నాయి. సెప్టెంబర్ వరకు సీడ్ వేస్తేనే మంచి ఎదుగుదల వస్తుంది. ఆలస్యమైతే చేపల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. కానీ ఈ కార్యక్రమంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్‌సింగ్ తెలిపారు.
ప్రతి సంవత్సరం ప్రభుత్వం మత్య్సకారులకు అందించే ఉచిత చేప పిల్లలను వెంటనే అందించాలి. గతంలో జూన్ నాటికి చేప పిల్లల పంపిణీపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసే వారు. కాంగ్రెస్ సర్కారులో ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఈ సంవత్సరం ఉచిత చేప పిల్లలు ఇవ్వకుంటే రానున్న రోజుల్లో ఉపాధి కోల్పోయో పరిస్థితి ఏర్పడుతుంది.
-కోల కరుణాకర్, మత్య్స సహకార సంఘం అధ్యక్షుడు, కందగట్ల
గతంలో ఉన్న ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది. ఉచితంగా చేప పిల్లలు, సబ్సిడీపై వాహనాలు, వలలు అందించడంతో ఎంతో మందికి లబ్ధి చేకూరింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటినా ఇప్పటివరకు మత్స్యకారుల గురించి ఆలోచించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉచిత చేప పిల్లలను వెంటనే అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
-జిట్టెబోయిన జానకి రాములు, మత్స్య సహకార సంఘం సభ్యుడు, గరిడేపల్లి