నల్లగొండ జిల్లాలో 2018 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పోలింగ్ 1.11శాతం తగ్గింది. ఈ సారి తుది పోలింగ్ 85.71శాతం నమోదైంది. గురువారం కొన్నిచోట్ల రాత్రి 8గంటల వరకు కూడా పోలింగ్ జరుగడంతో అన్ని నియోజకవర్గాల నుంచి పోలైన ఫైనల్ ఓట్ల సంఖ్య తేలేసరికి అర్ధరాత్రి దాటింది. దాంతో శుక్రవారం ఉదయం అధికారులు తుది పోలింగ్ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోనే మునుగోడులో అత్యధిక పోలింగ్ నమోదు కావడం విశేషం. ఇక్కడ పోలైన ఓట్ల శాతం 91.89 కాగా ఇది 2018 కంటే కూడా ఎక్కువ. ఇక నల్లగొండలో నమోదైన 81.60శాతమే అత్యల్పం.
పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఓటింగ్‌కు మాత్రం పురుషులే ఎక్కువ హాజరయ్యారు. జిల్లా మొత్తం ఓటర్లు 14,64,080 కాగా ఇందులో 12,54,799 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుది పోలింగ్ లెక్కలు ఇలా ఉంటే ఆయా పార్టీల అభ్యర్థులు మాత్రం ఓటర్ల మనోగతంపై మళ్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్ కేంద్రాలు, గ్రామాలు, మండలాల వారీగా తమ పోల్ మేనేజ్మెంట్లో కీలకంగా పనిచేసిన నేతలు, అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పోలింగ్ శాతం 78.31 కాగా, 2018 ఎన్నికల్లో 8.41శాతం పెరిగి 86.82శాతంగా నమోదైంది. ప్రస్తుత పోలింగ్ కిందటి సారికి అటూఇటుగా తేలింది. గత ఎన్నికలతో పోలిస్తే 1.11 శాతం తగ్గింది. ఈ సారి మొత్తంగా 85.71శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 91.89శాతం నమోదు కాగా, రాష్ట్రంలోనే టాప్‌గా నిలిచింది. జిల్లాలో అత్యల్పంగా నల్లగొండ నియోజకవర్గంలో 81.60 శాతం నమోదైంది. 2018తో పోలిస్తే 2.53శాతం తక్కువగా ఉన్నది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే మునుగోడు తర్వాత నకిరేకల్‌లో 86.67శాతం, నాగార్జునసాగర్‌లో 85.79, దేవరకొండలో 84.49, మిర్యాలగూడలో 83.49శాతం నమోదైంది. పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉన్న నల్లగొండ, మిర్యాలగూడల్లో కొంత పోలింగ్ శాతం తక్కువగా కనిపిస్తున్నది.
జిల్లాలో ఓటేసిన వారిలో మహిళల కంటే పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వాస్తవంగా మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ ఉండగా.. ఓటేయడంలో మాత్రం వారు వెనుకబడ్డారు. పురుష ఓటర్లు 7,26,169 మంది ఉంటే 6,27,521 మంది (86.42శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 7,37,789 ఉండగా.. 6,27,201 (85.01శాతం) మంది ఓటేశారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 1.41శాతం తక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తున్నది. ఇక ట్రాన్స్జెండర్ల ఓట్ల సంఖ్య 122 కాగా, 77 మంది ఓటేశారు.
పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల లెక్కలు తేలడంతో అభ్యర్థులంతా విశ్లేషణలపై దృష్టి సారించారు. శుక్రవారం రోజంతా తమ పార్టీ నేతలు, అనుచరులతో చర్చల్లో మునిగితేలారు. పోలింగ్ కేంద్రాలు, గ్రామాల వారీగా వివరాలు తెప్పించుకుని ఎవరికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందనే దానిపై చర్చ చేశారు. పోలైన ఓట్లలో ఎవరికి ఎంత మేరకు పడి ఉండవచ్చన్న అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. దీని ఆధారంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే తమ అనుచరులతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా రేపు జరిగే కౌటింగ్పైనే అందరిలో ఉత్కంఠ నెలకొంది.