నల్లగొండ విద్యావిభాగం(రామగిరి), మార్చి 23 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా నకిరేకల్ పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గత మూడు రోజులుగా అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆదివారం నిందితులను నకిరేకల్ జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. దాంతో న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో.. పోలీసులు నిందితులను జిల్లా జైలుకు తరలించారు.
ప్రశ్నాపత్రం లీకేజీ విషయమై అప్రమత్తమైన పోలీస్ శాఖ, విద్యాశాఖ అధికారులు ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే, పోలీసులు విచారణ వివరాలు బయటకు పొక్కకుండా అందా గోప్యంగా ఉంచుతున్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచిన సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల పెద్ద ఎత్తున కోర్టుకు తరలివచ్చారు. లీకేజీ వ్యవహారంపై నకిరేకల్ ఎంఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో వైపు ఎంఈవోతో పాటు జిల్లా అధికారులతో విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో కమిటీ వేసి.. విచారణ చేయనున్నట్లు తెలుస్తున్నది. విద్యాశాఖ కమిటీ అందించిన నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.