సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 01 : సూర్యాపేట జిల్లాలో వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువైన 106 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో అయన పాల్గొని మాట్లాడారు. ప్రతి నెల వందకు పైగా మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసు శాఖ రికవరీ చేసి బాదితులకు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏడాదిలో 11 విడతలుగా 1,540 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్, టెక్నికల్ టీం పోలీసుల కృషి చాలా ఉంటుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఈ మొబైల్స్ ను రికవరీ చేశామన్నారు. ప్రజల ఆస్తుల రక్షణలో పోలీస్ శాఖ అనుక్షణం ప్రజల పక్షాన పని చేస్తుందన్నారు.
తప్పుడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు, నేరాలకు పాల్పడే వారికి ఫ్రెండ్లీ పోలీస్ ఉండదని, సామాన్యుల పట్ల మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ ఉంటుందన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సి ఇ ఐ ఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలన్నారు. మొబైల్ ను బ్లాక్ చేసి, మీ సేవా ద్వారా ధరఖాస్తు సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అత్యాసకు పోయి సైబర్ మోసాల బారిన పడోద్దన్నారు. సిబిఐ, సిఐడి లాంటి దర్యాప్తు సంస్థల పేరుతో డిజిటల్ అరెస్ట్ అబద్దమన్నారు. మీ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక చర్యలు, అక్రమ రవాణాపై పోలీసుకు సమాచారం ఇవ్వా లని కోరారు. ప్రతి ఒక్కరూ సైబర్ వారియర్స్, డ్రగ్స్ నిర్మూల వారియ ర్స్ లాగా ఉండాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల గురించి చుట్టుపక్కల వారికి అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటి కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.