మిర్యాలగూడ, డిసెంబర్ 20 : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రాళ్ల కుప్పను ఢీకొట్టి గుంతలో పడిపోయింది. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి- నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డు నందిపాడు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్నది.
ఈ క్రమంలో డ్రైవర్ నిద్ర మత్తు వల్ల నందిపాడు గ్రామ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న రాళ్ల కుప్పను బస్సు ఢీకొట్టడంతో సమీపంలో ఉన్న గుంతలో ఇరుక్కుపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. వీరంతా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకొని తిరిగి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.