సూర్యాపేట, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు ఇస్తామన్న బోనస్ సూర్యాపేట జిల్లాలో సగం కూడా పూర్తి కాలేదు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రచారాల్లో ఊదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తామని నాలుక మడతేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రుణమాఫీ పూర్తి చేయకపోవడం, రెండు సీజన్లుగా రైతుబంధు ఇవ్వకపోగా సన్నాలకు పూర్తి స్థాయి బోనస్ రాకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో 1.18 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు పండించగా రైతులకు రూ.59 కోట్లు బోనస్ రావాలి. కానీ ఇప్పటి వరకు సుమారు రూ.23 కోట్లు రాగా ఇంకా రూ.36 కోట్లు పెండింగ్లో ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల సంగతి అటుంచితే, గతంలో కేసీఆర్ అమలు చేసిన పథకాలు కూడా కొనసాగడం లేదు. రైతు భరోసా ఎకరానికి ఏడాదికి రూ.15,000 ఇస్తామని చెప్పగా గత రెండు సీజన్లుగా ఆ ఊసే ఎత్తడం లేదు. రూ.రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని 40 శాతం కూడా పూర్తి చేయలేదు. రైతులకు నీటి కష్టాలు వర్ణనాతీతం. వీటితో పాటు ఎన్నికల ముందు రైతులు పండించే ప్రతి పంటకు బోనస్ ఇస్తామని వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుక మడతేసింది.
వడ్ల విషయానికి వస్తే 80శాతం మంది రైతులు ప్రైవేట్ మార్కెట్లో విక్రయించుకునే సన్నాలకు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. సూర్యాపేట జిల్లాలో 4,72,000 ఎకరాల్లో వరి సాగు కాగా అందులో 3,79,000 ఎకరాల్లో సన్న రకం ఉన్నది. కేవలం 93 వేల ఎకరాల్లో మాత్రమే దొడ్డు రకం సాగు అయినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. సన్న వడ్లు పండించిన అత్యధిక శాతం రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రైవేట్లో విక్రయించుకోగా 20శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. కాని వారికి రావాల్సిన బోనస్ సగమే వచ్చింది. వానకాలం సీజన్ పూర్తయి వడ్లన్నీ అమ్ముకొని, యాసంగికి సంబంధించిన నాట్లు కూడా దగ్గర పడగా ఇప్పటి వరకు సగం కూడా బోనస్ రైతులకు అందకపోవడం గమనార్హం. ఇచ్చిన హామీలు అమలులో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సన్న వడ్లకు బోనస్ ఇస్తుందా లేదా అన్న సందేహం రైతుల్లో నెలకొన్నది.
సన్న వడ్ల కాంటాలు వేసి రెండు నెలలు గడుస్తున్నా ప్రభు త్వం ఇస్తామన్న 500 బోనస్ రావ డం లేదు. ప్రభుత్వం ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో మావి 157 బస్తాలు కాంటాలు వేశారు. బోనస్ డబ్బులు అడిగితే మాకు తెలియదని అధికారులు సమాధానం చెబుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పటి వరకు రైతుబంధు కూడా రాలేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-హలవత్ వీర్య, రామునితండా, సర్వారం, మోతె