పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు చందంపేట మండలం మూడుదండ్ల గ్రామపంచాయతీ పరిధి ధర్మాతండాకు చెందిన రమావత్ కోటేశ్వర్నాయక్. అంగవైకల్యం ఉన్నా సాధారణ వ్యక్తులకు దీటుగా క్రీడల్లో రాణిస్తున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పథకాలు సాధించి ఔరా అనిపిస్తున్నాడు.
దేవరకొండ, జూన్ 7 : రమావత్ కోటేశ్వర్నాయక్ చిన్నప్పటి నుంచి దివ్యాంగుడు. ఆయన తల్లిదండ్రులు తావుర్యా, భారతి వ్యవసాయ కూలీలు. కోటేశ్వర్నాయక్ పాఠశాల నుంచి ఇంటర్ వరకు దేవరకొండలో చదివాడు. స్కూలుకు వెళ్లే సమయం నుంచి ఆటలపై ఆసక్తి ఉండేది. వైకల్యం ఉన్నా తన తోటి స్నేహితులతో క్రికెట్ ఆడేవాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి రొడామెస్ట్రీ కళాశాలలో డిగ్రీ చదివాడు. అనంతరం పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్‌డబ్ల్యూ పూర్తి చేశాడు. డిగ్రీ చదివే రోజుల్లో చందంపేట మండలం కాచరాజ్పల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు శంకర్ ప్రోత్సాహంతో వీల్‌చైర్ ఆటపై దృష్టి పెట్డాడు. పలుచోట్ల వీల్‌చైర్‌పై క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడి విజయం సాధించాడు. మారుమూల ప్రాంతానికి చెందిన కోటేశ్వర్నాయక్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ర్టానికి, జిల్లాకు పేరు తీసుకొస్తున్నాడు.
సాధారణ క్రీడాకారులతో సమానంగా
నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడే క్రికెట్ ఆడేవాడిని. నా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుంటే నన్ను ఆడనివ్వకపోయేది. వారిని బతిమిలాడి ఆడేది. దివ్యాంగుడైనా అలా రోజూ వారితో సమానంగా ఆడేవాడిని. ఆ తర్వాత వీల్‌చైర్ గేమ్స్‌పై ఆసక్తి పెరిగింది. శంకర్ ప్రోత్సాహంతో తెలంగాణ టీమ్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇప్పుడు వరుస ఆటలతో విజయాలు సాధిస్తున్నా. పట్టుదలతో కృషి చేస్తే ఫలితాలు వాటంతటే అవే వస్తాయి.
– రమావత్ కోటేశ్వర్నాయక్
జాతీయ స్థాయిలో ప్రతిభ
వీల్‌చైర్ ఆటతో జాతీయ స్థాయిలో కోటేశ్వర్రావు ప్రతిభ చూపుతున్నాడు. 2019లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఏషియన్, ఓషియన్ చాంపియన్ టోర్నమెంట్లో ఆడి విజేతగా నిల్చాడు. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో దివ్యాంగాగ్ వీల్‌చైర్ ప్రీమియం క్రికెట్ లీగ్‌మ్యాచ్‌లో మెయిన్ ఆఫ్‌ది సిరీస్ ఆడి బెస్ట్ బౌలర్‌గా, బెస్ట్ రన్నర్‌గా నిల్చాడు. ఇటీవల సౌత్‌జోన్ కోయంబత్తూర్‌లో జరిగిన వీల్ చైర్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొని రాష్ట్రం నుంచి రన్నర్ టీమ్‌గా విజయం సాధించాడు. ఐదు రాష్ర్టాల టీమ్‌లు పాల్గొనగా బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఢిల్లీలోని ద్వారక్లో జరిగే హైదరాబాద్ సన్‌గ్రేస్ టీమ్ నుంచి వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఆడనున్నాడు.