
కట్టంగూర్, అక్టోబర్ 12 : డిమాండ్ ఉన్న పంటల వైపు మళ్లడంతోపాటు సేంద్రియ ఎరువులతో సాగు చేయాలని రైతులకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోని గంగదేవిగూడెంలో కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌పీసీఎల్) భవన నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎఫ్పీసీఎల్లో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ యంత్రాల ప్రదర్శనను తిలకించి మాట్లాడారు. పంటలు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే రసాయన ఎరువులు ఉపకరిస్తాయని, అంతిమంగా పంటలకు బలాన్నిచ్చేది సేంద్రియ ఎరువులేనని తెలిపారు. గోమాతను పూజించడం అంటే భూమాతను కాపాడుకోవడమేనని, రైతులు పాడి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎఫ్పీసీఎల్లు సేంద్రియ ఎరువులపై దృష్టి సారించి రాష్ట్ర రైతాంగానికి మార్గదర్శనం కావాలని పిలుపునిచ్చారు. కట్టంగూర్ ఎఫ్పీసీఎల్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు ఉంటాయన్నారు. డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారించేందుకు రైతు సంఘాలు దోహదపడాలన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్నిచ్చే కంది, వేరుశనగ, శనగతోపాటు ఆయిల్ పామ్ తోటల పెంపకం రైతులకు ప్రయోజనకరమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రైతులకు పంటలపై అవగాహన కల్పించడంతోపాటు ఎలాంటి పంటలు వేయాలనే సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన నేరెడ్డి సత్యనారాయణరెడ్డి, జానకమ్మ 2 ఎకరాల 30 గుంటల భూమిని ఫార్మర్స్ కంపెనీకి విరాళంగా అందించారు. అనంతరం ఎఫ్‌పీసీఎల్ చైర్మన్ సైదమ్మను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, నాబార్డు డీడీఎం వినయ్‌కుమార్, జేసీ చంద్రశేఖర్, జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, కోరమాండల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, తిరుమల్‌రెడ్డి, స్వరాజ్, సతీశ్, సుధాకర్‌రెడ్డి, శశికాంత్, కృష్ణారావు, ప్రసాద్, కిరణ్‌చంద్ర, ప్రవీణ్చంద్రహాస్, సర్పంచ్ బెజవాడ సరోజనాసైదులు, ఎఫ్‌పీసీఎల్ వైస్ చైర్మన్ లింగారెడ్డి పాల్గొన్నారు.