
మిర్యాలగూడ అక్టోబర్ 12 : గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజీవ్ శర్మ కోరారు. మంగళవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో కొవిడ్ వాక్సినేషన్‌పై గ్రామాల సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మండలంలో ఇప్పటి వరకు 41శాతం వ్యాక్సినేషన్ మాత్రమే పూర్తయిందన్నారు. టీకాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే థర్డ్‌వేవ్‌కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నెల చివరి నాటికి 80 శాతం ప్రజలు వాక్సిన్ వేసుకునేలా చూడాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ కేసా రవి కుమార్, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, ఎంపీడీఓ కె.ఇందిర, మండల వైద్యాధికారి చింతల వనిత పాల్గొన్నారు.
గ్రామాల్లో ప్రచారం చేయాలి
పెద్దవూర : ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న కరోన టీకాల పై గ్రామాల్లో విసృతంగా ప్రచారం చేయాలని డీఏంహెచ్ఓ కొండల్ రావు అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించి అవగాహన సదస్సులో మాట్లాడారు. ఎంపీడీఓ దుబ్బా శ్యాం, ఎంపీఓ విజయ కుమారీ, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి
అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కరోనా టీకాలు వేస్తున్నారని, దీనిని అందరూ వినియోగించుకోవాలని అడవిదేవులపల్లి ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్ సూచించారు. మంగళవారం మండలకేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు.సమావేశంలో జడ్పీటీసీ కుర్రా సేవ్యా నాయక్, ఎంపీడీఓ ఎండీ మసూద్ షరీఫ్, మండల వైద్యాధికారి ఉపేందర్, త్రిపురారంలో జడ్పీటీసీ భారతీ భాస్కర్‌నాయక్, వైద్యులు రామకృష్ణప్రసాద్రావు, జానకిరాములు పాల్గొన్నారు.