యాదాద్రి, ఆగస్టు 27 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తజనుల సందడి నెలకొంది. శ్రావణమాసం చివరిరోజు కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి మాఢవీధులు భక్తులతో నిండిపోయాయి. సుమారు 30వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము 3గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
ఉదయం 3గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనర్సింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలోనే ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు, దర్బార్ సేవలు నిర్వహించారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం చేశారు. నవగ్రహాలకు తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వ్రతమాచరించారు. శ్రీవారి ఖజానాకు రూ. 34,17,150 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రావణమాసం చివరిరోజు కావడంతో యాదాద్రిలో వీఐపీల సందడి నెలకొన్నది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, ములుగు కలెక్టర్ కృష్ణా ఆదిత్య, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వేర్వేరుగా యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారి సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారికి అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయాధికారులు స్వామివారి ప్రసాదం అందించారు. అనంతరం యాదాద్రి ఆలయ నిర్మాణాలు తిలకించారు. ఆలయ నిర్మాణం భేష్‌గా ఉందని కితాబిచ్చారు.
యాదాద్రి దివ్యక్షేత్రంలో 30రోజులుగా నిర్వహిస్తున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమానికి ఆలయ ప్రధానార్చక బృందం ముగింపు పలికింది. నెల రోజుల పాటు అమృతపు జల్లుల మాదిరిగా ఆధ్యాత్మికమైన దివ్య దేవి ప్రవాహంగా కోటి కుంకుమార్చన మహోత్సవం జరిగిందని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు. ఉత్సవంలో 30మంది రుత్వికులు ప్రతిరోజూ అమ్మవారి నామాన్ని 3.60లక్షల సార్లు పారాయణం చేశారన్నారు. ఇలా నెల రోజుల్లో కోటి 8 లక్షల జపాన్ని పూర్తి చేశారన్నారు. దీంతో మూలస్థానంలో ఉన్న అమ్మవారి మహాయంత్రానికి అద్భుతమైన బలం చేకూరిందన్నారు. యాదాద్రి ఆలయం పునః ప్రారం భం అనంతరం ఈ ఉత్సవం మహా మహోత్సవంగా జరిగిందని చెప్పారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,31,500
వీఐపీ దర్శనం 1,80,000
వేద ఆశీర్వచనం 7,200
సుప్రభాతం 1,500
క్యారీబ్యాగుల విక్రయం 20,000
వ్రత పూజలు 1,44,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 36,000
ప్రసాద విక్రయం 11,89,200
వాహనపూజలు 11,200
అన్నదాన విరాళం 27,177
సువర్ణ పుష్పార్చన 1,38,980
లక్ష్మీ పుష్కరిణి 1,900
యాదరుషి నిలయం 83,140
పాతగుట్ట నుంచి 43,720
కొండపైకి వాహనాల అనుమతి 3,00,000
శివాలయం 8,500
లీసెస్, లీగల్ 1,34,688
ఇతర విభాగాలు 1,09,344