పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 6 : మొన్నటి వరకు సాగర్‌లో సరిపడా నీళ్లు లేకపోవడంతో ఒకటి రెండు మోటార్ల ద్వారా తాగునీటి అవసరాలకు మాత్రమే ఏఎమ్మార్పీ నీటిని వినియోగించారు. మరింత నీటిమట్టం తగ్గడంతో అత్యవసర మోటార్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎగువన కురిసిన వర్షాలకు సాగర్‌కు భారీ వరద వచ్చి చేరడంతో పూర్తి స్థాయి నీటి మట్టం పెరిగింది.
కానీ అధికారుల ముందస్తు వ్యూహం లేకపోవడంతో నేడు ఏఎమ్మార్పీ ఆయకట్టు ఎండేపోయే పరిస్థితి దాపురించింది. లక్షల క్యూసెక్కులు సాగర నుంచి వృథాగా పోతున్నా ఏఎమ్మార్పీ నుంచి నాలుగు మోటార్ల ద్వారా 2,400 క్యూసెక్కులు తీసుకోలేకపోతున్నాం. నీటి విడుదల కోసం ఏఎమ్మార్పీ నుంచి మూడు మోటార్ల ద్వారా 1,800 క్యూసెక్కులు విడుదల చేసినా అవికూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి.
ప్రధాన కాల్వతో పాటు అన్ని డిస్ట్రిబ్యూటరీలకు నీటిని విడుదల చేయాలని అధికారులు సిద్ధం కాగా ఐదు రోజుల క్రితం ఏఎమ్మార్పీ మూడో యూనిట్ రన్ చేశారు. కానీ సాంకేతిక సమస్యలతో కూలింగ్ పైపులైన్ల ద్వారా నీళ్లు లీకు కావడంతో రెండు మోటార్లను మాత్రమే నడుపాల్సి వస్తున్నది. నాలుగు మోటార్ల ద్వారా 2,400 క్యూసెక్కులు విడుదల చేసే ఏకేబీఆర్ మొదటి యూనిట్ మరమ్మతులకు గురి కావడంతో పూర్తిగా నిలిచిపోయింది.
ఎండిన ఏకేబీఆర్
తాగునీటి అవసరాలకు కోసం ఏకేబీఆర్ నుంచి నీటి విడుదల చేయడంతో నీటి మట్టం గణనీయంగా తగ్గింది. దాంతో ప్రస్తుతం విడుదల చేస్తున్న నీళ్లు ఏకేబీఆర్ నిండడానికి కూడా సరిపోవడంలేదు. సాగర్ గేట్ల ద్వారా లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్న ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలోని అన్ని డిస్ట్రిబ్యూటరీలకు పూర్తి స్థాయిలో నీటి విడుదల కొనసాగడం లేదు. దాంతో ప్రధాన కాల్వకు దాదాపు 1,500 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా మూడు మోటార్లు సక్రమంగా నడవకపోవడం, ఏకేబీఆర్ నీటి మట్టం తక్కువ ఉండడంతో కేవలం 850 క్యూసెక్కులే విడుదల చేస్తున్నారు.
గతంలో అధికారులు ముందస్తుగా ఏకేబీఆర్ పూర్తి స్థాయిలో నింపుకునే ఉంటే ప్రస్తుతం విడుదల అవుతున్న నీళ్లు జంటనగరాలకు తాగునీటితోపాటు ఏఎమ్మార్పీ ఆయకట్టు, ప్రాజెక్టు పరిధిలోని చెరువుల నింపుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం విడుదల అవుతున్న నీరు ఏకేబీఆర్ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలతోపాటు లింక్ కెనాల్‌పై మోటార్ల ద్వారా కొంత వ్యవసాయానికి వినియోగించడంతో ఏకేబీఆర్లోకి 1,800 క్యూసెక్కులు చేరడం లేదు.
ఏకేబీఆర్ నీటిమట్టం 245 ఎఫ్ఆర్ఎల్కుగానూ కేవలం 241.5 ఎఫ్ఆర్ఎల్ ఉంది. దీంతో ఏకేబీఆర్ నీటిమట్టం పెంచాలంటే ప్రధాన కాల్వకు మూడు రోజులపాటు పూర్తి నీటిని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రైతులు వరి నాట్లు వేస్తున్న తరుణంలో ప్రధాన కాల్వకు నీటి నిలుపుల చేయలేక, ఏకేబీఆర్ నింపలేక అధికారులు తల పట్టుకుంటున్నారు.
మరమ్మతుల్లో మొదటి యూనిట్
ఏఎమ్మార్పీ మొదటి యూనిట్ క్యాపిటల్ ఓరాలింగ్లో భాగంగా రెండు నెలులుగా నడుపడం లేదు. దాంతో మూడు ఏఎమ్మార్పీ మూడు మోటార్లపైనే ఆధారపడాల్సి వస్తున్నది. గతంలో సాగర్ నీటి మట్టం తక్కువ ఉన్నా వేసవిలోనే ఓరాలింగ్ పూర్తి చేస్తే సాగర్‌కు వరదలు వచ్చే నాటికి మొదటి యూనిట్ వినియోగంలోకి వచ్చేది. కానీ ప్రస్తుతం సాగర్ నిండుగా ఉన్న మొదటి యూనిట్ నడుపలేని పరిస్థితి దాపురించింది.
గతంలో యూనిట్ మరమ్మతుల టెండర్ల జాప్యంతో సకాలంలో పనులు పూర్తి కావడంలేదని తెలుస్తున్నది. సాగర్‌లో పూర్తి స్థాయిలో నీళ్లు ఉన్నప్పటీకీ ముందస్తు ప్రణాళిక లేక నేడు ఏఎమ్మార్పీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేక పోతున్నారని పలువురుఆరోపిస్తున్నారు.
నిరంతర నీటి విడుదలతో మోటార్లకు మరమ్మతులు చేయలేకపోతున్నాం
ప్రస్తుతం ఏఎమ్మార్పీ మోటార్లు నిరంతరం నడుపడంతో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేకపోతున్నాం. రెండు రోజుల క్రితం మూడో యూనిట్ నిలిచిపోవడంతో తక్షణమే మరమ్మతులు చేశాం. ప్రస్తుతం మూడు యూనిట్ల ద్వారా 1800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నాం. రెండు మాసాలుగా క్యాపిటల్ ఓరాలింగ్ జరుగుతున్నందున మొదటి యూనిట్ పనిచేయడం లేదు. వేగవంతంగా పనులు పూర్తి చేసి త్వరలో మొదటి యూనిట్‌ను వినియోగంలోకి తీసుకొస్తాం.
-ఏడీఈ సుధాకర్