నాంపల్లి, అక్టోబర్ 22 : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టులపై ధ్యాసే తప్ప.. ప్రజా సమస్యలపై పట్టింపులేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వేల కోట్ల కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి అభివృద్ధి కోసమేనని ప్రజల వద్ద మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఓటు వేసిన మునుగోడు ప్రజలను మోసం చేయడానికి మనసు ఎలా వచ్చిందని రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీజేపీకి ఓటు వేయమని చెప్పడానికి సిగ్గు లేదా? అన్నారు. దీనిపై కాంగ్రెస్ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మునుగోడులో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.