
నల్లగొండ ప్రతినిధి, జనవరి 1(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకులను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్‌లు కటింగ్స్, విందులు, వినోదాలు, నృత్యాలతో హోరెత్తించారు. మహిళలు రంగు రంగుల రంగవళ్లులతో వాకిళ్లను అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక రుచులను ఇంటిల్లిపాది ఆస్వాదించారు. యువత ఒకచోట చేరి సంబురాలు చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రెమారాజేశ్వరి పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కేక్‌కట్ చేశారు. డీటీసీ ఎస్పీ సతీశ్ చోడగిరితోపాటు జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సమిష్టిగా పనిచేసి మంచి ఫలితాలు, విజయాలు సాధిస్తూ పోలీసుశాఖ గౌరవం పెంచేలా కృషి చేయాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నూతన సంవత్సర వేడుకులు దూరంగా ఉన్నారు. సాయంత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి దైవసన్నిధిలో గడిపారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డిని జడ్పీ ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల ప్రజలు, పార్టీ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నివాసం సందడిగా మారింది. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, సంస్థల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నేతలు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ హాలియాలోని టీఆర్ఎస్ కార్యాలయంతోపాటు తన నివాసంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.
‘ఫస్ట్ కిక్’..
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా శుక్రవారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో రూ.18 కోట్ల మద్యం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. సాధారణ రోజుల్లో రూ.12 కోట్ల నుంచి 13కోట్ల వరకు అమ్మకాలు జరుగుతుండగా డిసెంబర్ 31న అదనంగా రూ.5 కోట్ల అమ్మకాలు జరిగినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 336 మద్యం దుకాణాలు ఉండగా, వాటిలో నల్లగొండలో 115, సూర్యాపేటలో 99, యాదిద్రిలో 82 ఉన్నాయి. ఈ ఏడాది కొత్త మద్యం పాలసీతో దుకాణాల సంఖ్య పెరిగింది. ఈ మేరకు అమ్మకాలు సైతం పెరిగాయి. ఇక 2020 ఏడాదితో పోల్చిస్తే 2021లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2020లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.273.10 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. కానీ 2021లో డిసెంబర్ 31 నాటికి 329.74కోట్ల అమ్మకాలు జరుగడం గమనార్హం. కిందటి ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా రూ.56.64 కోట్ల మద్యం విక్రయాలు అదనంగా జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.