గరిడేపల్లి, నవంబర్ 8: ఇటీవల కురిసిన వర్షాలకు పంట చేలలో నీరు నిల్వ ఉండడంతో పాటు వరిపైరు నేలకొరగడంతో రైతులకు ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అది బాడువ పొలమైతే నష్టం మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ పొలాల్లో రైతులు యాజమాన్య పద్ధ్దతులను పాటించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త దొంగరి నరేశ్ సూచించారు. నేలకొరిగిన వరిలో పాటించాల్సినసిన మెళుకువలను ఆయన తెలిపారు. మరిన్ని వివరాల కోసం 92906 15952 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచి ంచారు. . ఆయన తెలిపిన వివరాలు…
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వరి ప్రస్తుతం కోత దశలో ఉంది. గాలి, వాన కారణంగా వరి పొలాలు నేలకొరిగాయి. రైతులు పడిపోయిన పొలాలను వరిపైరును జడలు కట్టాలి.
పొలాల్లో గింజలు నేలకు తాకితే కాల్వలు తీసి నీటిని బయటకు పంపించి ఆర
బెట్టాలి. లేకుంటే గింజలు మొలకెత్తి గింజలు నల్లగా మారుతాయి. దాంతో రైతులకు మార్కెట్లో ధర తగ్గుతుంది.
పొలంలో తేమ ఉంటే 2 శాతం ఉప్పు ద్రావణం పొలంపై పిచికారీ చేయాలి. లీటర్ నీటిలో 2 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేయడం ద్వారా మొలకెత్తే గింజశాతం తగ్గించుకోవచ్చు.
రైతులు తడిసిన ధాన్యం కోత కోస్తే క్వింటా ధాన్యానికి కిలో ఉప్పు కలిపి ఆరబెట్టాలి. దీని ద్వారా మొలకెత్తే శాతం తగ్గించుకోవచ్చు.
జాగ్రత్తలతో నష్టాన్ని తగ్గించుకోవచ్చు
ఇటీవల కురిసిన వానలకు వందల ఎకరాల్లో వరి పొలాలు నేలకొరిగాయి. రైతులు వాటిని అలాగే వదిలేస్తే గింజలు సరిగా ఏర్పడక తాలుగా మారుతాయి. అప్పటికే గింజ పోసుకున్నవి నల్లగా మారుతాయి. అందుకే రైతులు పంట మొక్కలు నేలకొరగగానే పొలంలో కాల్వలు తీసి వాటి ద్వారా నీటిని బయటకు పంపించాలి. తేమ ఎక్కువగా ఉంటే పొలంలో ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. జాగ్రత్తలు పాటించడం ద్వారా రైతులు సాధ్యమైనంత వరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
– దొంగరి నరేశ్,కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి