
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 12మంది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరితో పాటు స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా తేరా చిన్నపరెడ్డి, భువనగిరి చెందిన మరో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఉన్నారు. వీరికి సంబంధించి ఒక్కొక్కరికి ఏటా రూ.5కోట్ల చొప్పున మొత్తం రూ.70కోట్లు నిధులు రానున్నాయి. ఇక వీరితో పాటు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి నిధుల్లోనూ జిల్లాకు వాటా దక్కనుంది. అందరివీ కలిపి సుమారు రూ.75కోట్ల వరకు నియోజకవర్గ అభివృద్ధి పథకం నిధులు జిల్లాకు రానున్నాయి. అయితే కరోనాతో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రెండేండ్లుగా సీడీపీ నిధులు విడుదల కాలేదు. అయితే, గతంలో ఇవి రూ.3కోట్లు ఉండేవి. కానీ, ప్రస్తుతం సీఎం కేసీఆర్ 2021-22ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నిధులను రూ.5కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలకు ఏటా ఇక నుంచి ఐదు కోట్ల రూపాయలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసుకునే వెసులుబాటు లభించింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
40శాతం విద్యకు కేటాయింపు…
నిధుల్లో తప్పనిసరిగా 40శాతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులకు కేటాయించాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు. అంటే ఏటా సుమారు రూ.2కోట్లు కేవలం విద్యాసంస్థల్లోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఆటస్థలాల అభివృద్ధి, సైన్స్ ప్రయోగశాలలు, తాగునీటి సౌకర్యం లాంటి వసతులకు ఖర్చు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ సర్వేలు కొనసాగుతున్నాయి. విద్యాసంస్థల్లో ఇప్పటికే ఉన్న వసతులు, ఇంకా ఉన్న అవసరాలు ఏమిటనే ప్రాతిపదికన వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్‌లో పాఠశాలల స్థితిగతులపై వివరాలను నమోదు చేస్తున్నారు. గత నెల 19నుంచి సర్వే కొనసాగుతున్నది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్(ఎస్ఐఎస్)పేరుతో దీన్ని చేపట్టారు. నేరుగా యాప్‌లోనే లైవ్ ఫొటోలతో సహా వివరాలు పొందుపరుస్తున్నారు. సర్వే తుది నివేదిక ప్రకారం నిధులను ఖర్చు చేయడం కూడా సులువుగా మారనుంది.
ఎస్సీ, ఎస్టీ ఏరియాల్లోనూతప్పనిసరిగా…
నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఆవాసాల వారీగా జనాభా ప్రతిపాదికన ఎస్సీ దళితవాడల్లోనూ, గిరిజన తండాల్లోనూ అబివృద్ధి పనులకు తప్పనిసరిగా ఖర్చు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ నిధులతో దళితవాడలు, తండాల్లో అభివృద్ధికి, మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తారు. జిల్లాకు మొత్తం రూ.75కోట్లు కాగా, అందులో 15.23కోట్లు దళితవాడల్లో, రూ.7.50కోట్లు గిరిజన తండాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే 20శాతం నిధులు ఎస్సీ ఏరియాలకు, 10శాతం నిధులు తండాలకు వెచ్చించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ కోటా నిధులను విద్యాసంస్థల్లో ఖర్చు చేయల్సిన 40శాతం నిధుల్లోనూ వినియోగించే వెసులుబాటు కల్పించారు. అంటే ప్రత్యేకంగా దళితవాడల్లో, తండాల్లో ఉన్న విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించుకోవచ్చు. మిగతా రూ.52.27కోట్లు జనరల్ కోటా కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం నిర్వహించిన సర్వే నివేదిక సిద్ధంగా ఉన్నది.
మంత్రి జగదీశ్‌రెడ్డి ఆమోదం తప్పనిసరి…
ఉమ్మడి జిల్లా పరిధిలో ఖర్చు చేసే సీడీపీ నిధులకు సంబంధించి ప్రతి పైసాకూ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న జగదీశ్‌రెడ్డి ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రజాప్రతినిధులు తమ నిధుల ఖర్చుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేశాక జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగం ద్వారా మంత్రికి సమర్పించాల్సి ఉంటుంది. వీటి పరిశీలన అనంతరం మంత్రి ఆమోదముద్ర వేస్తేనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనున్నాయి. అయితే, కొంతకాలంగా ఎదురుచూస్తున్న సీడీపీ నిధుల రాకతో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తన నియోజకవర్గాల్లోని అవసరాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.