కార్తిక పౌర్ణమి సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నదీస్నానాలు చేసి పూజలు చేశారు. దీపారాధనతో ఆలయాలు వెలుగులతో విరజిమ్మాయి. యాదగిరిగుట్ట, చెర్వుగట్టు, పానగల్, వాడపల్లితోపాటు పలు క్షేత్రాలు కళకళలాడాయి. రాత్రి పలు ఆలయాల్లో జ్వాలా తోరణాలు కనుల పండువగా సాగాయి. శివ నామస్మరణతో మారుమోగిన శివాలయాలు ముక్కంటి దర్శనానికి బారులు తీరిన భక్తులు
రామగిరి, నవంబర్ 7 : కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం శివాలయాలకు భక్తులు పోట్టెతారు. నదుల్లో పుణ్యస్నానాలను ఆచరించి కార్తిక దీపలు వెలిగించారు. ముక్కంటికి రుద్రాభిషేకాలు, బిల్వాదళార్చనలతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
నల్లగొండ జిల్లాకేంద్రంలోని పానగల్లో గల పచ్చల, చాయా సోమేశ్వరాలయంలో భక్తులు బారులు తీరారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, ఫలప్రసాదాలను అందజేశారు. చాయా సోమేశ్వరాలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అర్చకులు ఉదయ్కుమార్శర్మ, అజయ్‌కుమార్ శర్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నల్లగొండలోని తులసీనగర్‌లోని భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని కాశీ విశ్వేరాస్వామి ఆలయంలో భక్తులు ముక్కంటికి అభిషేకాలు నిర్వహించారు.
శివ, ఆంజనేయ దీక్షస్వాములు ప్రత్యేక పూజలు జరిపారు. సత్యనారాయణ స్వామి ఆలయంలో సాముహిక సత్యనారాయణవ్రతాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ జూనియర్ అసిస్టెంట్ జి.శేఖర్, గోదాదేవి, ఆలయ ప్రధాన అర్చకుడు చంద్రశేఖరాశాస్త్రీ, అర్చకులు పాల్గొన్నారు. జ్వాలాతోరణం… నల్లగొండలోని పానగల్లో గల చాయా సోమేశ్వరాలయంలో జ్వాలాతోరణం నిర్వహించారు. విశిష్ట వేడుకలకు 12వ బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సాంబయ్య హాజరుకాగా ఆలయ కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం జ్వాలా తోరణం తిలకించారు.
నల్లగొండలోని చర్లపల్లిలో డీవీఎం కళాశాల ప్రాంగణంలోని శివాలయంలో అర్చకులు నవీన్‌శర్మ మంత్రోచ్చారణలతో పూజలు సాగాయి, అదే విధంగా బ్రహ్మగుట్టపై గల శివాలయం, ఒంటి స్తంభం సమీపంలోగల శివాలయం, కలెక్టరేట్ సమీపంలో, బీట్ మార్కెట్లోని ఉమామహేశ్వరాలయం, రామగిరిలోని చంద్రమౌళిశ్వరాస్వామి కనుక దుర్గా ఆలయం, క్రాంతినగర్ శివాలయం, కామేశ్వర్రావు కాలనీలోని శివాలయంలో అభిషేకాలు, అర్చనలు చేశారు.
పాతబస్తీలోని భక్తాంజనేయస్వామి సహిత సంతోషీమాతా శివాలయం, వీటికాలనీలోని శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. రామగిరిలోని షిర్డీసాయిబాబా ఆలయంలో అభిషేకాలు, హైదరాబాద్, పానగల్ రోడ్డులోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు చేశారు. ముశంపంల్లి రోడ్డులోని షిర్డీసాయి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : భువనగిరి పట్టణంలోని పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో సోమవారం కార్తిక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అయ్యప్ప, శివమాలాధారులకు అన్నదానం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ సహకారంతో అందజేసిన దుప్పట్లను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు యాచకులు, పేదలకు పంపిణీ చేశారు.