ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా అనేక చర్యలుతీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నది. గతంలో విద్యా శాఖ తనిఖీల్లో వెలుగుచూసిన అంశాల ఆధారంగా ఉపాధ్యాయుల హాజరు, సమయ పాలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
ప్రస్తుతం అమల్లో ఉన్న బయోమెట్రిక్ విధానంలో సమస్యలు తలెత్తుతుండడంతో దాని స్థానంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) గుర్తింపు కార్డులను టీచర్లకు జారీ చేయనున్నది. దాంతో తరచూ సెలవులు పెట్టడం, ఆలస్యంగా వచ్చి హాజరు వేసుకోవడం, వేరొకరితో పాఠాలు చెప్పించడం, ఇద్దరు టీచర్లు ఉన్న స్కూల్లో వంతుల వారీగా విధులకు హాజరవడం వంటి సమస్యలకు పరిష్కారం లభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఆర్ఎఫ్డీలో ఉద్యోగుల సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవడంతో బదిలీలు, పదోన్నతుల సమయంలో ఎదురయ్యే సీనియారిటీ సమస్యలకు చెక్ పడనున్నది.
రామగిరి, డిసెంబర్ 13 : మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా మారుమూల గ్రామాలు, తండాల్లో ఉపాధ్యాయుల హాజరుశాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) గుర్తింపు కార్డులను అందించేందుకు కసరత్తు చేస్తున్నది. త్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఈ కార్డులు అంద జేయనుంది. ప్రభుత్వం రెండేండ్లుగా వీటిని అందించాలని సంకల్పంతో ఉన్నా కొవిడ్ నేపథ్యంలో ఆలస్యమైంది. తిరిగి పాఠశాలలు పూర్తి స్థాయిలో కొనసాగుతుండడంతో కార్డుల జారీకి సత్వర చర్యలు చేపట్టింది.
కార్డులతో ఉపాధ్యాయులకు మేలు..
ప్రభుత్వం ఇవ్వనున్న ఆర్ఎఫ్ఐడీ కార్డుతో ఉపాధ్యాయులకు మేలు జరుగనుంది. ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పుట్టిన ప్రాంతం, ప్రస్తుత నివాసం, పుట్టిన తేదీ, సెల్, ఆధార్, పాన్‌కార్డు నంబర్లు, గతంలో ఎక్కడ పనిచేశారు..? ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు, జీతభత్యాలు, హోదాతో(ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం, జీహెచ్ఎం) పూర్తి వివరాలతో నిక్షిప్తం చేసి ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన కార్డులను ప్రత్యేకంగా తయరు చేయిస్తున్నారు.
బయోమెట్రిక్ హాజరుకు భిన్నంగా ..
గతంలో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. సాంకేతిక సమస్య వల్ల ఆశించిన మేర ఫలితాలు రాలేదు. దాంతో ప్రస్తుతం ఆలాంటి సమస్యలు లేకుండా ఆర్ఎఫ్ఐడీ కార్డులతో హాజరు పక్కా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
పాఠశాల గోడపై ఉపాధ్యాయుల సమాచారం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ టీచర్ ఆ పాఠశాలలో ఎప్పుడు చేరారు. అతను బోధించే సబ్జెక్టులు, ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాలి. అదే విధంగా సమాచార హక్కు చట్టం బోర్డు ఉంచాలి. కానీ చాలా పాఠశాలల్లో ఈ బోర్డులు కనిపించడం లేదనేది వాస్తవం. విద్యాశాఖ ఉన్నతాధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
గత పరిస్థితుల నేపథ్యంలో..
ఆర్ఎఫ్ఐడీ పనితీరు ఇలా..
టీచర్ల కొత్తగా జారీచేసే ఫొటో ఆధారిత ఆర్ఎఫ్ఐడీ కార్డు బయోమెట్రిక్ వద్ద స్కైప్ చేయగానే హాజరు నమోదవుతుంది. టీచర్ల డుమ్మా కొట్టినా..స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినా…ముందే వెళ్లి పోయినా ఉన్నతాధికారులకు తెలిసేలా కార్డును రూపొందిస్తున్నారు. సరికొత్త విధానంతో సమయపాలన పాటించాలని లేకుంటే రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చి మూడో పర్యాయం సీఎల్ పడేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
ప్రార్థ్ధనా సమయానికి వారంలో రెండు సార్లు రాకుంటే మిషన్‌లో ఎల్లోజోన్ సిగ్నల్ చూపి వార్నింగ్ ఇస్తుంది. మూడోసారి కూడా ఆలస్యంగా హాజరైతే రెడ్ జోన్ చూపుతుంది. ఇలా చూపిన వారికి మెమోలు జారీచేసి సంజాయిషీ కోరడం లేదా ఆఫ్‌డే సీఎల్ వేయడం లేదా అవసరమైతే శాఖ పరమైన చర్యలకు కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.