కోదాడ, ఆగస్టు 24 : ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు భవిష్యత్‌లో అన్నదాతలకు ఉరితాళ్లుగా మారనున్నాయి.. అందుకే చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు ప్రతినిధులు నిర్వహించిన ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభించింది’ అని విప్లవాత్మక సినిమాల దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తాను రూపొందించిన రైతన్న సినిమాను విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణమూర్తి మాట్లాడారు. కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు కూలీలుగా మారడం అనివార్యమన్నారు. రైతు వ్యతిరేక చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే రైతన్న సినిమాను రూపొందించామన్నారు. రైతుబంధు, రైతు బీమా, రుణ మాఫీ తదితర పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని పేర్కొన్నారు. ఆత్మహత్యలు నిర్మూలించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. రైతులను కూలీలుగా మార్చే ఈ చట్టాలను రద్దు చేయాలని నారాయణమూర్తి తీసిన రైతన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు ఖాజా మొహినుద్దీన్, మామిడి రామారావు పాల్గొన్నారు.