యాదాద్రి, అక్టోబర్ 10: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో సోమవారం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. మొదటగా సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు.
స్వామి, అమ్మవార్లను తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్దగల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సోమవారం కావడంతో పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో లింగేశ్వర కుటుంబంతోపాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నరపాటు జరిపారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. స్వామివారిని సుమారు 15 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.51,13,569 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సేవలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని తరించారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న మంత్రి స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణపుష్పార్చనలో పాల్గొన్నారు. అనంతరం పశ్చిమ దిశలో ఉన్న వేంచేపు మండపంలో సేదతీరిన మంత్రి భక్తులతో ముచ్చటించారు. కొత్తగా నిర్మించిన ఆలయం ఎలా ఉందని, ఎవరు కట్టించారో తెలుసా.. అని అడిగారు. ఆలయం చాలా బాగుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించారు కదా.. అని భక్తులు సమాధానమిచ్చారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 80,700
వీఐపీ దర్శనాలు 1,74,000
వేద ఆశీర్వచనం 4,200
సుప్రభాతం 1,700
ప్రచార శాఖ 8,050
వ్రత పూజలు 71,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 61,400
ప్రసాద విక్రయం 9,40,450
వాహన పూజలు 10,800
అన్నదాన విరాళం 40,883
సువర్ణ పుష్పార్చన 99,464
యాదరుషి నిలయం 53,212
పాతగుట్ట నుంచి 30,430
కొండపైకి వాహన ప్రవేశం 2,50,000
లక్ష్మీ పుష్కరిణి 1,000
శివాలయం 9,400