గురువారం 01 అక్టోబర్ 2020
Nagarkurnool - Aug 14, 2020 , 00:11:35

14గంటలు..18మండలాలు..

14గంటలు..18మండలాలు..

  • నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ శర్మన్‌ సుడిగాలి పర్యటన
  • పదర ఎంపీడీవోకు షోకాజ్‌ నోటీస్‌

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ శర్మన్‌ సుడిగాలి పర్యటన అధికారుల్లో గుబులు రేకెత్తించింది. కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్న ఆయన తాజాగా ఒకే రోజు జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు జిల్లాలోని 18 మండలాల్లో సుడిగాలి పర్యటనచేశారు. అన్ని మండల కేంద్రాల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొదటగా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో శివారు మండలమైన పెంట్లవెల్లిలో కాలినడకన తిరిగారు. అనంతరం కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లి, కోడేరుతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రాత్రి వరకూ కలెక్టర్‌ పర్యటనలు నిర్వహించడం విశేషం. పదర మండల పరిషత్‌ అధికారి కార్యాలయంలో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్య, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమిష్టి కృషితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, పారిశుధ్య కార్యక్రమాలు నిత్య జరగాలని సూచించారు. జోరు వర్షం కురుస్తున్నా కలెక్టర్‌ పర్యటన కొనసాగడం గమనార్హం. logo