ఆదివారం 24 మే 2020
Nagarkurnool - Feb 16, 2020 , 00:37:32

గులాబీకే సహకారం

గులాబీకే సహకారం
  • సింగిల్‌ విండోల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌
  • నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు
  • 23విండోల్లో మెజార్టీ గెలుపు
  • 299 డైరెక్టర్‌ స్థానాలకుగాను టీఆర్‌ఎస్‌కే 237

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సింగిల్‌ విండో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జోరు చూపించింది. మొత్తం 23సహకార సంఘాలకు గాను గొరిట(తిమ్మాజిపేట) విండో ఏకగ్రీవమైంది. ఇందులోని 13వార్డులు సైతం ఏకగ్రీవం కావడంతో శనివారం 22సంఘాల పరిధిలోని 246వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 22సహకార సంఘాల్లోనూ పార్టీ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యతను సాధించారు. దీంతో మొత్తం 23సహకార సంఘాలు టీఆర్‌ఎస్‌ కైవసమయ్యాయి. ఇలా మొత్తం 299వార్డులకు గాను 236వార్డుల్లో టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయం సాధించింది. కాంగ్రెస్‌, కమలం పార్టీలు మాత్రం ఉనికిని కోల్పోవడం గమనార్హం. 23సింగిల్‌ విండోల్లో ఒక్క స్థానాన్నీ చేజిక్కించుకోకపోగా డైరెక్టర్‌ పదవుల్లోనూ మొండి చెయ్యే ఎదురయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 35వార్డుల్లోనే గెలుపొందగా కమలం పార్టీ  కేవలం 5డైరెక్టర్‌ పదవులతో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. కొల్లాపూర్‌లో మున్సిపల్‌ ఎన్నికల మాదిరి కాంగ్రెస్‌ పార్టీ ఒక్క డైరెక్టర్‌ స్థానాన్ని కూడా సాధించలేదు. 


అలాగే బీజేపీ నాగర్‌కర్నూల్‌, అచ్చంపేటలో ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయాయి. నాగర్‌కర్నూల్‌ మండలం గన్యాగుల విండోలోనూ 13స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే గెలుపొందారు. ఇక్కడ ఓ వార్డులో ఒకరు టీఆర్‌ఎస్‌ నుంచి ఏకగ్రీవం కాగా శనివారం నాటి ఎన్నికల్లో గెలిచిన 12మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందారు. ప్రభుత్వ రైతు సంక్షేమ విధానాలతో రైతుల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బలపర్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు రైతులైన ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రచారంలోనూ ఇది స్పష్టంగా కనిపించింది. రైతుబంధు, రైతుభీమా, 24గంటల కరెంట్‌, సాగునీటి విడుదలలాంటి ఎన్నో పథకాలు టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజలు ముఖ్యంగా రైతుల్లో నమ్మకాన్ని పెంచాయి. 


దీంతో గతేడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన పురపాలికల ఎన్నికల వరకూ టీఆర్‌ఎస్‌కే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా ఎన్నికల ఫలితాలతో నియోజకవర్గాల్లో సందడి నెలకొంది. విండో కార్యాలయాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు ఊరేగింపుగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలకు చేరుకొన్నారు. మొత్తం మీద సహకార సంఘాల ఎన్నికలు టీఆర్‌ఎస్‌లో ఉత్తేజాన్ని నింపగా కాంగ్రెస్‌, కమలం పార్టీల్లో నిస్తేజం అలుముకొంది. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన అభ్యర్థులను ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, జైపాల్‌ యాదవ్‌ అభినందించారు.


Previous Article 77.92%

logo