బాలీవుడ్‌కు దర్శకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీ, డైరెక్టర్ల ఆలోచనాశైలిలో వస్తున్న మార్పులపై స్పందించాడు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే, బ్లాక్‌బస్టర్ హిట్లను అందించే దర్శకులు.. ప్రస్తుతం బాలీవుడ్లో ఎవరూ లేరని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో పరిశ్రమ ఓ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని చెప్పుకొచ్చాడు. తరాల మార్పే ఈ సమస్యకు మూలకారణమని తాను నమ్ముతున్నట్లు కరణ్ వెల్లడించాడు. “ఉత్తర భారతదేశంలోని ఒక తరం మొత్తం.. ఒక రకమైన హిందీ సినిమాలు చూస్తూ పెరిగింది.
రొమాంటిక్ డ్రామాలు, షారుక్ ఖాన్ కాలం నాటి ప్రేమకథలు, విదేశాల్లో చిత్రీకరించిన సినిమాలు, ప్రపంచీకరణ ద్వారా.. బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ప్రభావితమయ్యారు. అప్పటి దర్శక నిర్మాతలు కూడా మాస్ ఎంటర్టైనర్లను తీయడానికి ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం వాటిని అనుసరించడంలో నవతరం డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్నారు” అంటూ వ్యాఖ్యానించాడు. కొందరు దర్శకులు దక్షిణ భారత ఫార్ములా అయిన మాస్ మసాలా, ఎపిక్-స్కేల్ యాక్షన్ వెంట పడుతున్నారని ఎద్దేవా చేశాడు. వాటిని ఆపేసి, బాలీవుడ్ కొన్ని దశాబ్దాలుగా రాణించిన జోనర్లపై దృష్టి పెట్టాలని హితవు పలికాడు. అదే సమయంలో హిందీ సినిమా బలానికి తగ్గట్టుగా కొందరు కొత్త దర్శకులు చిన్నాచితకా సినిమాలు నిర్మిస్తున్నారనీ, అలాంటివాళ్లు పెరగాలని చెప్పాడు.