సిద్దిపేట, జూన్ 21: మానసిక వికాసానికి యో గా దోహదం చేస్తుందని సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో యోగా ఫర్ సెల్ఫ్, యోగా ఫర్ సొసైటీ అనే సంకల్ప నినాదంతో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగం, భారత స్వామి ట్రస్ట్, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో దశాబ్ది యోగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్తో కలిసి చైర్పర్సన్ యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా రోజాశర్మ మాట్లాడుతూ ప్రతిఒకరు యోగా చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో యోగాను భాగం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు మారుల గురించే కాకుండా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. దృఢమైన మనసు, దృఢమైన శరీరం ఉన్న చోట విద్య వర్ధిల్లుతుందన్నారు. యోగా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని తెలిపారు. వేడుకల్లో 600 మంది సామూహిక యోగాసనాలు వేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర యోగా గురువు తోట సతీశ్, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అధ్యక్షుడు తోట అశోక్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ఉమాదేవి, వ్యాస మహర్షి యోగా సొసైటీ చైర్మన్ డాక్టర్ అరవింద్, వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ పూర్ణిమ ఎల్లం, డిప్యూటీ డీఎం హెచ్‌వో కాశీనాథ్, పతాంజలి యోగా సమితి చీఫ్ పాట్రన్ అంజయ్య, భారత స్వామి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాములు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి రామేశ్వర్‌రెడ్డి, యోగా శిక్షకురాలు సంధ్య, ఆయా సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.