మనోహరాబాద్, సెప్టెంబర్ 27 : చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ముగ్గురు మృతి చెందగా, బాలుడు గల్లంతై, ఒకరు ప్రాణాలతో బయటపడిన సంఘటన మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగాయిపల్లి గ్రామానికి చెందిన ఫిరంగి చంద్రయ్య ఇంట్లో బోనాల జాతర ఆదివారం నిర్వహించగా, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన దొడ్డ బాలమణి (30), ఆమె కుమారుడు చరణ్ (6), దొడ్డ లక్ష్మి (30) చుట్టపు చూపుగా హాజరయ్యారు. సోమవారం ఉదయం దొడ్డ బాలమణి, దొడ్డ చరణ్, దొడ్డ లక్ష్మి, ఫిరంగి లక్ష్మి, ఆమె కూతురు లావణ్య (20) కలిసి బట్టలు ఉతికేందుకు రంగాయిపల్లి గ్రామ చెరువు బతుకమ్మ మెట్ల వద్దకు వెళ్లారు. కాగా బాలుడు దొడ్డ చరణ్ ఆడుకుంటూ కాలుజారీ చెరువులో పడిపోయాడు. బాలుడిని కాపాడేందుకు బాలమణి, లక్ష్మి, లావణ్య, ఫిరంగి లక్ష్మి ఒకరి వెంట ఒకరు చెరువులో దిగి మునిగిపోగా, దొడ్డ బాలమణి, ఫిరంగి లావణ్య , దొడ్డ లక్ష్మి మృత్యువాత పడ్డారు. ఫిరంగి లక్ష్మిని స్థానికులు కాపాడారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకొని బాలమణి, లక్ష్మి, లావణ్యల మృత దేహాలను బయటకు తీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడు చరణ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి చెరువులో పడి ముగ్గురు మహిళలు మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.