అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్, డిసెంబర్ 17: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగంగా చేపట్టి, రైతులకు సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా అప్పటి సీఎం కేసీఆర్ వృథాగా సముద్రంలోకి పోతున్న వర్షం నీటితో గోదావరి నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నింపారన్నారు.
కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ జలాశయానికి తరలించిన నీటిని సింగూర్‌కు తీసుకువచ్చి సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 622 మీటర్ల ఎత్తులో ఉన్న జహీరాబాద్ నియోజకవర్గంలోని రైతులకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. అందులోభాగంగానే నియోజకవర్గంలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి మండలాల పరిధిలోని 115 గ్రామాల్లోని 1,03, 259 ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు.
అందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలోని చిన్న చెల్మెడలో పంపుహౌస్ కోసం అప్పటి అర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్‌రావు భూమి పూజ చేశారన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో నదులు, పెద్ద చెరువులు లేవు. కేవలం వర్షాధారంపైనే రైతులు వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగంగా చేపట్టి, రైతులకు సాగు నీరందించి ఆదుకోవాలన్నారు.