జహీరాబాద్, అక్టోబర్ 9: అల్లం, ఆలుగడ్డలు, చిరు ధాన్యాలు, చెరుకు, పసుపు తదితర వాణిజ్య పంటల సాగుకు నెలవైన జహీరాబాద్ నియోజకవర్గంలో పూల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో పూలతోటలకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్, కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల్లో రైతులు పంట పొలాలు, పాలీహౌస్‌ల్లో బంతి, చామంతి, గులాబీ తదితర పూలను సాగు చేస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 50 ఎకరాలపైనే పూల తోటలు సాగు చేస్తున్నారు.
బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు పూలకు బాగా డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు ఆర ఎకరం నుంచి రెండు, మూడు ఎకరాల వరకు సాగుచేస్తున్నారు. రెం డు, మూడు, వారానికి ఒకసారి పూలను తెంచి మార్కెట్లో విక్రయిస్త్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన పూల వ్యాపారులు రైతుల పొలాల వద్దకే వచ్చి తీసుకెళ్తున్నారు. చాలా గ్రామాల్లో రైతులు పూల సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తక్కువ నీటితో ఎక్కవ లా భాలు వచ్చే పూలసాగును ఉద్యానవన శాఖ అధికారు లు ప్రోత్సహిస్తే మరింత పెరిగి అవకాశాలు ఉంటాయి.
తక్కువ సమయంలో పంట చేతికొచ్చి ఆదాయాన్ని సమకూర్చే బంతి పూల సాగుకు రైతులు మందుకు వస్తున్నారు. ఎకరాకు రూ. 30 వేల వరకు పెట్టుబడితో 40 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. సీజన్‌కు అనుగుణంగా బంతిసాగు రైతులు కనీసం కేజీ రూ.50 నుం చి రూ.100 వరకు మార్కెట్లో బంతిపూలను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం దసరా, బతుకమ్మ పండుగల సమయంలో కేజీ బంతిపూలు రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. జహీరాబాద్, బీదర్, నారాయణఖేడ్, హైదరాబాద్ తదితర ప్రాంతా ల్లో విక్రయిస్తున్నారు.రహదారుల వెంట సాగుచేస్తున్న భూముల్లో వికపించిన పువ్వులు ప్రయాణికులు, వాహనచోదకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
నాలుగేండ్ల సంది బంతి పూలను సాగుచేస్తున్న. ఆర ఎకరంలో సాగుకు రూ.10వేల వరకు ఖర్సు అయిం ది. రోజూ డ్రిప్ ద్వారా నీరు పెడుతున్న. విత్తనం నాటిన మూడు నెలల్లోనే బంతి పూలు చేతికొస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో బంతి పూలు కిలోకు రూ.80-130 వరకు ధర పలుకుతున్నది. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు అస్తుండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఖర్చులన్నీ పోనూ రూ. 50 వేల వరకు అదాయాన్ని సంపాదిస్తున్నా.
– జమునాబాయి. మహిళా రైతు, హద్నూర్ గిరిజన తండా