సంగారెడ్డి, మార్చి14(నమస్తే తెలంగాణ): జహీరాబాద్ పార్లమెంట్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున బీబీ పాటిల్ ఎంపీగా గెలుపొందారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో సైతం గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ నేత గాలి అనిల్‌కుమార్ పోటీ చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఏడు అసెంబ్లీ నియోజకవర్లాల్లో బీఆర్ఎస్ బలంగా ఉంది. జహీరాబాద్ పార్లమెంట్‌కు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో ఇక్కడ జరిగే ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్‌కుమార్ పేరును అధినేత బుధవారం కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేశ్ షెట్కార్ పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన బీబీ పాటిల్ ఇటీవల బీజేపీలో చేరారు. బీజేపీ బీబీ పాటిల్‌కు ఎంపీ టికెట్ ప్రకటించింది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇది ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపించనున్నది. కాంగ్రెస్ నుంచి జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఉజ్వల్రెడ్డితో పాటు కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఎంపీ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ అధిష్టానం నారాయణఖేడ్‌కు చెందిన మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్‌కు ఎంపీ టికెట్ ప్రకటించింది. ఎంపీ టికెట్ ఆశించిన ఉజ్వల్‌రెడ్డి ఇతర నేతలు పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున తనకు విజయావకాశాలు ఉంటాయని సురేశ్ షెట్కార్ నమ్మకంగా ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి తోడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. దీంతో కాంగ్రెస్ గెలుపు అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీ నుంచి పది మందికి పైగా నాయకులు జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. మాజీ ఎంపీ బాగారెడ్డి తనయుడు జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ ఆలే నరేంద్ర కుమారుడు భాస్కర్, బద్దం బాల్‌రెడ్డి కుమారుడు మహిపాల్‌రెడ్డి, కామారెడ్డికి చెందిన పైడి ఎల్లారెడ్డి, సుభాష్‌రెడ్డి తదితరులు ఎంపీ టికెట్ ఆశించారు. బీజేపీ అధిష్టానం సొంత పార్టీ నేతలను కాదని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌కు టికెట్ ఇచ్చింది. పార్టీ మారి వచ్చిన బీబీ పాటిల్‌కు టికెట్ ఇవ్వడంతో బీజేపీ అధిష్టానం తీరుపై ఎంపీ టికెట్ ఆశించిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి నేతలు ఎంపీ ఎన్నికల్లో బీబీ పాటిల్‌కు మద్దతుగా పనిచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
మోదీ చరిష్మా, అయోధ్య రామమందిరం నిర్మాణం తనకు కలిసి వస్తాయని బీబీ పాటిల్ ధీమాగా ఉన్నారు. రెండు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన బీబీ పాటిల్ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. రెండుసార్లు ఎంపీగా ఉన్నా కేంద్రం నుంచి పెద్ద ప్రాజెక్టులు ఏవీ తీసుకు రాలేదని, అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో చేయలేదని ఆయనపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. దీనికి తోడు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు ఒక్క కామారెడ్డిలో మాత్రమే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. మిగతా నియోజకవర్గాల్లో బీజేపీ అంత బలంగా లేదు. దీంతో బీబీ పాటిల్ గెలుపు సులభతరం కాదన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతున్నది.
జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మూడోసారి కైవసం చేసుకుంటామన్న ధీమా బీఆర్ఎస్లో ఉంది. 2014, 2019 ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ గెలుపుపై ధీమాగా ఉంది. జహీరాబాద్ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బలంగా ఉంది. దీనికి తోడు తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ నేత గాలి అనిల్‌కుమార్‌కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.
గాలి అనిల్‌కుమార్ తెలంగాణ సాధన కోసం ఉద్యమించారు. బీఆర్ఎస్లో చురుగ్గా ఉన్నారు. ప్రజల కోసం పనిచేసే గాలి అనిల్‌కుమార్ గెలుపు కోసం ఇప్పటి నుంచే బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలకు మార్గనిర్దేశం చేశారు. గాలి అనిల్‌కుమార్ గెలుపు కోసం బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధ్దం చేసింది. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు.
నారాయణఖేడ్, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించి పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిశారు. త్వరలోనే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఎంపీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధ్దం అవుతున్నది. కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలను తనను గెలిపిస్తాయని గాలి అనిల్‌కుమార్ నమ్మకంగా చెబుతున్నారు.