చేర్యాల, జూలై 20: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్ర సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో చేర్యాల మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు రాసలీలల కోసం ఓ యువతిని తీసుకువెళ్లగా పోలీసులకు పట్టుబడ్డాడు. కొమురవెల్లి నుంచి ఐనాపూర్ రహదారిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో యువజన నాయకుడు మహిళతో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వెళ్లి యువజన నాయకుడిని మొదటగా ప్రశ్నించి బేరం మాట్లాడుకున్నారు.
అదే సమయంలో యువజన నాయకుడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. అతడి స్నేహితుడి ద్వారా పోలీస్ కానిస్టేబుళ్లు ఫోన్ పే ద్వారా స్నేహితులకు డబ్బులు కొట్టించుకున్నట్లు సమాచారం.ఇద్దరు పీసీలు అక్కడికి వెళ్లి యువజన నాయకుడిని పట్టుకుని ప్రశ్నించడంతో పాటు బేరసారాలు మాట్లాడుకున్నట్లు తెలిసిన మరో పీసీ హుటాహుటిన అక్కడికి వెళ్లి ఆయన సైతం వారితో కలిసి పోయాడని తెలిసింది.
ఈ విషయం కాస్తా పైస్థ్ధాయికి వెళ్లడంతో ముగ్గురు పీసీలకు మెమోలు జారీ చేసినట్లు స్థ్ధానికంగా చర్చ జరుగుతున్నది. అధికార పార్టీకి చెందిన జిల్లా యువజన నాయకుడి విషయం పార్టీ పెద్దలకు తెలియజేయడంతో ఆయన్ను కాపాడేందుకు వారు శ్రద్ధ చూపించడంతో విషయం కాస్తా సైలెంట్ అయిపోయినట్లుగా తెలిసింది. ఈ విషయమై సీఐ రమేశ్‌నాయక్‌ను ఫోన్లో సంప్రదించగా మెమోల జారీ ఏమీలేదని, కొమురవెల్లికి వచ్చినవారిపై అనుమానం వస్తే ఆరా తీయడం సహజమన్నారు. పుణ్యక్షేత్రం సమీపంలోని కొన్ని లాడ్జిల్లో సైతం కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.