సిద్దిపేట, జనవరి 8: ‘అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గం టెన్త్ ఫలితాల్లో ఆదర్శంగా ఉండాలనే తపనతో మీకు ఉత్తరం పంపిన వచ్చిందా.. పది నుంచే మీ పిల్లల భవిష్యత్ ప్రారంభం అవుతుంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మార్చిలో జరిగే టెన్త్ వార్షిక పరీక్షల నేపథ్యంలో టెన్త్ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో గురువారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ మీ పిల్లలను చదివించేందుకు కొన్ని విషయాలు మీతో పంచుకోవటానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపారు.
మరికొద్ది రోజుల్లోనే మీ పిల్లలు పదోతరగతి పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. అధిక మారులతో గట్టెకితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుందని, లేదంటే మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి, మీ పిల్లల చదువుకు ఎలాంటి అర్థం ఉండదన్నారు. మీ పిల్లలు చదువులో విజయం సాధించాక మీరు ఇచ్చే అభినందనకంటే మీ పిల్లలు పరీక్షలు రాసేముందు మీరు తీసుకునే ప్రత్యేక శ్రద్ధముఖ్యమన్నారు. పది వార్షిక పరీక్షలు ముగిసేదాకా పిల్లలపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా సెల్ఫోన్లకు దూరంగా ఉంచండి, విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు, టీవీల జోలికి వెళ్లకుండా చూడాలన్నారు.
వ్యవసాయ పనులు,ఇంటికి సంబంధించిన పనులను కూడా చెప్పవద్దని తల్లిదండ్రులను కోరారు. కొన్నేండ్లుగా సిద్దిపేట నియోజకవర్గంలో చదివిన పదోతరగతి విద్యార్థులంతా అధిక మారులు సాధిస్తున్నారన్నారు. నూటికి నూరుశాతం పాసవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్‌ఐటీలో 169 మంది సిద్దిపేట నియోజకవర్గం విద్యార్థులు సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. ఎంతోమంది మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు సాధించి డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదిగారన్నారు.
మీ పిల్లలు అధిక మారులతో పాస్కావాలనేదే నా ఆకాంక్ష . నా వంతు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా విద్యాధికారి నుంచి మీ పిల్లలకు చదువు చెప్పే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూళ్లల్లో డిజిటల్ స్టడీ, మోడల్ టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. పిల్లలకు డిజిటల్ కంటెంట్ పుస్తకాలు అందిస్తూ ప్రతి సబ్జెక్టుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధిగా, మీ కుటుంబంలో ఒకడిగా నావంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. మీ పిల్లల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని చెప్పారు.