భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్
పాపన్నపేట, ఫిబ్రవరి25: ఏడుపాయల జాతర ప్రారంభ సమయం దగ్గర పడుతున్నదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ రమేశ్‌తో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం దేవాదాయశాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పైపులైన్ల లీకేజీ పనులు త్వరగా పూర్తి చేసి, నల్లాలు బిగించాలన్నారు. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా రెండు అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పార్కింగ్ స్థలం, ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పారబోస్తే వాటిని వెంటవెంటనే అక్కడి నుంచి తరలించే చర్యలు చేపట్టాలన్నారు.
దుర్గామాతను దర్శించుకున్న అదనపు కలెక్టర్
వనదుర్గాభవానీ అమ్మవారిని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, అడిషనల్ కలెక్టర్ రమేశ్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ ఈవో సార శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం జాతరపై సమావేశం నిర్వహించి, ఏర్పాట్లను పరిశీలించారు.
వాహనాలు నిలిపే స్థల పరిశీలన
కొల్చారం, ఫిబ్రవరి 25: ఏడుపాయల జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఆమె అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలిసి వాహనాలు నిలిపే స్థలాన్ని పరిశీలించారు. రెండో బ్రిడ్జి వరకే వాహనాలు అనుమతించాలని, బ్రిడ్జి పక్క నుంచి నీటిలోకి దిగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఘన్పూర్ ఆనకట్టపైకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ, మెడికల్ క్యాంపుల స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. ఆమె వెంట జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు, డీఎస్పీ సైదులు, ఆర్డీవో సాయిరాం, సీఐ వెంకటేశ్, ఎస్సైలు విజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్‌కుమార్, గిర్దావర్ శ్రీహరి, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కొమ్ముల యాదాగౌడ్, ఏడుపాయల మాజీ డైరెక్టర్ గౌరీశంకర్ ఉన్నారు.