కంది, మార్చి 6: సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ న్యూఢిల్లీ సహకారంతో సైన్స్ కమ్యూనికేషన్‌పై ఐదు రోజల వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖలోని మాలవ్య మిషన్ టీచర్ టైనింగ్ ప్రోగ్రాం కింద ఈ వర్క్‌షాప్ జరగనుంది. ఈ వర్క్‌షాప్‌ను ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ సభ్యులు డాక్టర్ శ్రీపర్ణ చటర్జీ బుధవారం సాయంత్రం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 11 మంది నిపుణులైన రిసోర్స్ పర్సన్లతో శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సమర్థవంతమైన సైన్స్ కమ్యూనికేషన్ ద్వారా పరిశోధనలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ వర్క్‌షాప్ దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థుల్లో స్వతంత్ర పరిశోధనా ఆలోచనలు తీసుకొచ్చేందుకు ప్రొఫెసర్లు కృషి చేయాలని సూచించారు. యువ పరిశోధకులు ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.