హుస్నాబాద్, నవంబర్ 19: సహకార సంఘాలను బలోపేతం చేసి రైతులను, మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్‌లోని పలు వార్డుల్లో డ్రైనేజీ, సీసీరోడ్ల నిర్మాణానికి, బుడగ జంగాల కాలనీ వద్ద మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం హుస్నాబాద్ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు, యువత, మహిళల ఉపాధి కోసం హుస్నాబాద్ ప్రాంతంలో కాలుష్య రహిత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామ శివారును పారిశ్రామిక ప్రాంతంగా రూపదిద్దుతామని, ఇక్కడ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, రైస్ మిల్లులు, అగ్రికల్చర్‌కు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గౌరవెల్లి రిజర్వాయర్ కాలువల నిర్మాణానికి జరుగుతున్న భూసేకరణకు రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. హుస్నాబాద్‌లో ప్రారంభించిన వృత్తి నైపుణ్య కేంద్రాన్ని మహిళలు, యువత సద్వినియోగం చేసుకొని పలు అంశాల్లో శిక్షణ పొంది ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. సెట్విన్ శిక్షణ కేంద్రంలో కుట్టు మిషన్, బ్యూటీషియన్, కంప్యూటర్ ల్యాబ్, ఐటీఐ మెకానిక్స్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. యువత విదేశాల్లో ఉపాధి పొందేందుకు టాంటాం సంస్థ ద్వారా త్వరలోనే జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, ఎండీ వేణుగోపాల్, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ మానాల మోహన్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్ పర్సన్ అయిలేని అనితారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.