నర్సాపూర్, నవంబర్ 26: ఉపాధి హామీ కూలీ డబ్బులు ఇప్పించండి మేడం… అంటూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని పలువురు ఈజీఎస్ మహిళా కూలీలు వేడుకున్నారు. మంగళవారం మండలంలోని పెద్దచింతకుంటలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధికారులతో కలిసి పర్యటించి మొక్కలు నాటారు. ఏడాదిగా తమకు కూలి రావడం లేదని ఈ సందర్భంగా పలువురు కూలీలు ఎమ్మెల్యేకు గోడు వెల్లబోసుకున్నారు. మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో మధులత, ఏపీవో అంజిరెడ్డి సమక్షంలోనే మహిళా కూలీలు ఎమ్మెల్యే విషయం చెప్పుకొచ్చారు.
పెద్దచింతకుంట గ్రామం ప్రధాన రహదారికి ఇరువైపులా గతేడాది మొక్కలు నాటామని, వాటికి సంబంధించిన డబ్బులు ఇంకా తమకు చెల్లించలేదని తెలిపారు. మొక్కలకు గోతులు లోతుగా రాకుంటే టిఫిన్ బాక్స్ మూతలతో తీశామని ఓ మహిళ తన బాధను వెల్లగక్కింది. ఈ డబ్బుల గురించి మండల కార్యాలయానికి వెళ్లి అడగగా, ఎందుకు లొళ్లి పెడుతున్నారంటూ మందలించాలరని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధికారులను ప్రశ్నించారు. తక్షణమే కూలీలకు డబ్బులు అందజేయాలని ఆదేశించారు. అక్కడే ఉన్న మండల ప్రత్యేకాధికారి కల్పించుకొని కూలీల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.