సిద్దిపేట, సెప్టెంబర్ 26 : క్రీడలతో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి వస్తుందని, ఒత్తిడి తట్టుకుని ముందుకు సాగేలా క్రీడలు జీవితంలో ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. 67వ సిద్దిపేట క్రీడా సమాఖ్య 2023-24 జిల్లాస్థాయి పాఠశాలల ఆటల పోటీలను పరేడ్‌గ్రౌండ్‌లో మంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, స్థానిక ప్రజాప్రతినిధులతో హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ విద్య, వైద్యం, రిజర్వాయర్లు, క్రీడలు ఇలా అన్ని రంగాల్లో సిద్దిపేటను అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే సిద్దిపేట స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం రూ.11కోట్లు విడుదల చేయిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యమే మహా భాగ్యమని పెద్దలు అన్నట్లుగా ఆరోగ్యం బాగా లేకపోతే ఎంత చదివినా, ఎంత డబ్బున్నా ఉపయోగం లేదన్నారు. మీరంతా మీ అభిరుచులకు అనుగుణంగా క్రీడల్లో రాణించాలని కోరారు. పిల్లలకు మంచి ఆరోగ్యంతోపాటు క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దాలని క్రీడా, వైద్యశాఖ అధికారులకు సూచించారు.
ముఖ్యంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఆటలు గ్రామీణ ఆటలుగా ఖర్చు లేకుండా ఉన్నదాంట్లో బాగా ఆడేవారిని ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ క్రీడలైన వీటికే దేశస్థాయిలో అవార్డులు వస్తాయని తెలిపారు. సిద్దిపేటలోఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మూడు రోజులు ఈ క్రీడలు జరుగుతాయని, ఇప్పటికే అన్ని ఆటలకు నెలవుగా సిద్దిపేట మారిందన్నారు. సిద్దిపేటకు వాలీబాల్ అకాడమీ మంజూరైనట్లు మంత్రి చెప్పారు. వాలీబాల్ కోర్టుల అభివృద్ధికి రూ.1.50లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. క్రికెట్ గ్యాలరీ, స్టేడియం ఆప్‌గ్రేడ్ కోసం రూ.4కోట్లు, ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూ రు చేసినట్లు తెలిపారు. విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వాలీబాల్ అకాడమీలో కోచింగ్ పెట్టి రెసిడెన్షియల్ అకామిడేషన్ ఏర్పాటు చేశామన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మిం గ్ ఫూల్, క్రికెట్ స్టేడియం ఉన్నాయన్నారు. ఇండోర్ షటిల్ కోర్టు ఉన్నప్పటికీ సరిపోతలేదని చెబితే, మరో రెండు ఇండోర్ షటిల్ కోర్టులు మంజూ రు చేయించానని అవి త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. తల్లిదండ్రులు ఉద యం ఆరు గంటలకే పిల్లలు మైదానంలో వచ్చే విధంగా చూడాలని మంత్రి సూచించారు. ఆటలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచుతాయన్నారు. జిల్లాలోని అన్ని జెడ్పీ హైస్కూళ్లకు రూ.50 వేలతో క్రీడా పరికరాలను అందించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. అనంతరం సిద్దిపేట, నారాయణరావుపేట జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, ఎస్జీఫ్ సెక్రటరీ రామేశ్వర్‌రెడ్డి, పీఈటీలు సతీష్, వెంకటస్వామి, సుజాత, అశోక్, ఉప్పలయ్య, శ్రీనివాసు, శ్రీనివాసులు, ఆయా క్రీడాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.