కోహీర్, జూన్ 23: గ్రామ పాలనలో కీలకమైన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గొటిగార్‌పల్లి, ఖానాపూర్, కొత్తూర్‌లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఆయా గ్రామాల్లో పనులను ప్రారంభించారు. ఖానాపూర్, గొటిగార్‌పల్లి గ్రామాల్లో స్లాబ్ వరకు పనులు పూర్తయ్యాయి. కొత్తూర్(కే) గ్రామంలో పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. ఈ మూడు గ్రామాల్లో పంచాయతీల భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోవడంతో అధికారులతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కోహీర్‌తో పాటు పోతిరెడ్డిపల్లి, మాచిరెడ్డిపల్లి, పర్సపల్లి గ్రామాల్లో కొత్త పంచాయతీ భవనాలను బీఆర్ఎస్ సర్కారు నిర్మించింది. వాటిలో సరిపడా గదులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు, గ్రామ పాలనకు జీపీలు దోహదపడుతున్నాయి. సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శికి ఓ గదిని కేటాయించారు. ఒక పెద్ద హాలు కూడా అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు నిర్మించారు. వాటి మాదిరిగానే గొటిగార్‌పల్లి, కొత్తూర్(కే), ఖానాపూర్ గ్రామాల్లో పనులను ప్రారంభించారు. కానీ, ఎన్నికల కోడ్ రావడం, నిధుల కొరతతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించి వేగంగా పనులు పూర్తిచేసి జీపీ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.