హుస్నాబాద్, జూలై 10: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని ప్రస్తుతం ఉన్న చోటు నుంచి పట్టణానికి దూరంగా తరలించేందుకు సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు విఫలయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయని ప్రచారం కావడంతో హుస్నాబాద్ పట్టణ ప్రజలతో పాటు కోర్టు పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడున్న కోర్టు భవనం బస్టాండ్‌కు కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్నది. ఈ కోర్టుకు వెళ్లడమే కష్టంగా ఉన్నదంటే, మరో రెండు కిలోమీటర్ల దూరంలో అంటే బస్టాండ్ నుంచి సుమారు 3కిలోమీటర్ల దూరంలో కోర్టు భవనం నిర్మిస్తే కక్షిదారులు, సాధారణ ప్రజలు, వివిధ కోర్టు పనుల కోసం వచ్చివారి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సబ్‌కోర్టు మంజూరవుతుందనే నెపంతో ప్రస్తుతం ఉన్న చోటు నుంచి కోర్టును తరలించేందుకు ససేమిరా ఒప్పుకోమని వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు, న్యాయవాదులు చెబుతున్నారు. పెద్దఎ త్తున ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.
హుస్నాబాద్‌లోని మున్సిఫ్ కోర్టు భవన సముదాయ నిర్మాణానికి హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామ శివారులో 5.20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కేటాయించిన స్థలం వద్ద జడ్జిలు రేవతి, ప్రమీదలతో పాటు రెవెన్యూ అధికారులు, కోర్టు అధికారులు వెళ్లి బోర్డును సైతం ఏర్పాటు చేశారు. స్థలం కేటాయించడం, బోర్డును ఏర్పాటు చేయడంతో ఇక కోర్టు తరలిపోవడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.
హుస్నాబాద్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును జిల్లెలగడ్డ సమీపంలోకి తరలించొద్దని, అందువల్ల కలిగే ఇబ్బందులను వివరిస్తూ హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాతో పాటు పలు ప్రధాన చౌరస్తాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. హుస్నాబాద్ పట్టణ ప్రజల పేరు మీద వెలసిన ఈ పోస్టర్లో కోర్టును తరలించకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే కొత్త భవనం నిర్మించాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని ఫ్లెక్సీలో విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం నడుస్తున్న కోర్టు భవనం ప్రజలకు అందుబాటులోనే ఉంది. బస్టాండ్‌కు వచ్చిన కక్షిదారులు, అధికారులు, న్యాయవాదులు అవసరమైతే కాలినడక వెళ్లే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సు, ఆటోలు నిత్యం తిరుగుతుంటాయి. దాదాపు 2ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవన సముదాయంలో ప్రస్తుతం రెండు కోర్టులు నడుస్తున్నాయి. మరో కోర్టు భవనంతో పాటు క్వార్టర్స్ నిర్మించుకునే అవకాశం కూడా ఉంది. సబ్‌కోర్టు వచ్చినా నడుపుకోవచ్చు. కానీ, సుమారు 3 కిలోమీటర్ల దూరంలో, ఎలాంటి జనావాసాలు లేని ప్రాంతం, గుట్టల మధ్య కోర్టు భవనాన్ని ఎలా నిర్మిస్తారనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి. ఇప్పుడు నడుస్తున్న కోర్టు భవనంలో ఉన్న భవనాల్లో జడ్జిలు నివాసం ఉండే పరిస్థితి లేదు. ఇక అటవీ ప్రాం తంలో నిర్మిస్తే అక్కడ ఎలా నివాసం ఉంటారని పలువురు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం(ఐవోసీ) భవనాన్ని పట్టణానికి దూరంగా నిర్మించారని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులే, ఇప్పుడు కోర్టు భవాన్ని పట్టణానికి 3కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు యత్నించడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అవగాహన లేకుండా ఐవోసీ నిర్మించారని, తాము గెలిస్తే ఐవోసీని పట్టణంలోని తెస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన వారు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రజలు అడుగుతున్నారు. ఇతరులు చేస్తే తప్పు… వీళ్లు చేస్తే మాత్రం రైటా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఎవరికి ప్రయోజనం చేకూర్చేందుకు కొత్త కోర్టు భవన సముదాయ నిర్మాణం చేపడుతున్నారో చెప్పాలంటున్నారు. ఇప్పుడు కోర్టు భవనం కోసం కేటాయించిన స్థలం పక్కనే వందెకరాలకు పైగా కలిగి ఉన్న వ్యాపారి ప్రయోజనం కోసమేనని ప్రజలు చర్చించుకుంటున్నారు.