మెదక్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒకరూ సహకరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ కోరారు. బుధవారం మెదక్‌లోని ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశం జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, పోలీస్, వైద్య, అగ్రికల్చర్, విద్య, సంక్షేమ, డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ గంజాయి సాగు చేస్తూ పట్టుబడితే అటువంటి వారికి ప్రభుత్వ పథకాలు పూర్తిగా రద్దవుతాయన్నారు.
మనోరాబాద్, తూప్రాన్ ఏరియాలో పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయని, వలసవాదులు, యువత కంపెనీల్లో పనిచేస్తూ డ్రగ్స్ సేవిస్తారన్నారు. చెక్‌పోస్టు ఏర్పాటు చేసి రవాణాను అడ్డుకొని డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలన్నారు. సాగుకు యోగ్యంకాని భూముల్లో ఎకువగా గంజాయి పండించే అవకాశం ఉందని అటువంటి వాటిపై వ్యవసాయశాఖ అధికారులు తనిఖీ నిర్వహించి నివేదికలు సమర్పించాలన్నారు.
మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉకుపాదం మోపేందుకు సంబంధితశాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలన్నారు. తండా లు, రిమోట్ ఏరియాల్లో తనిఖీ చేసి డ్రగ్స్ నిర్మూలనకు తమవంతు సహకారం అందించాలన్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ ప్రాధాన్యత క్రమంలో డిస్పోస్ చేయాలన్నారు. చికెన్ సెంటర్స్, పాఠశాలలు, హాస్టల్ బిల్డింగ్స్ లో సెలవు దినాల్లో యువత డ్రగ్స్ వాడే అవకాశం ఉన్నందున వాటిపై నిఘా పెంచాలన్నారు.
జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లో 18 ఏండ్లు నిండని వారికి అమ్మరాదని బోర్డులు ఏర్పాటు చేయాలని సూచిం చారు. గ్రామస్థాయి అభివృద్ధి కమిటీల ద్వారా మాదకద్రవ్యాల నిర్మూ లనకు సహాయ, సహకారాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ డీఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత మత్తు పదా ర్థాలకు బానిస కాకుండా పోలీస్ యంత్రాంగం నిరంతర తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.