పటాన్చెరు, మార్చి 11: కేసీఆర్ హయాంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరులో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సునీతాలక్ష్మారెడ్డి, మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు సుమిత్రానంద్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీజయపాల్రెడ్డి, భారతీనగర్ కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి, గీతాభూపాల్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోనే మహిళా సంక్షేమం సాధ్యమైందన్నారు. కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటీ ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థిక భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేసి వారి ఆరోగ్యాలను కాపాడారన్నారు. షీటీమ్స్‌తో మహిళలకు భద్రత కల్పించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉండేవన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళా సంక్షేమం కనిపించడం లేదన్నారు. కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళా దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మహిళా సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేశామన్నారు.
మహిళలను అన్నిరంగాల్లో ప్రోత్సహించామన్నారు. ప్రతి విషయంలో మహిళలు పురుషులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి కల్పించుకోవాలని సూచించారు. కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు. మహిళలకు సొంత ఖర్చుతో ఉచిత కుట్టుమిషన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి శిక్షణ అందజేస్తున్నానని వివరించారు. స్కూటీలు ఇచ్చి మహిళలను ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్లో మహిళలకు పూర్తి భద్రత ఉండేదన్నారు. పటాన్చెరు మహిళలను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశం గౌడ్, ఆదర్శ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ శంకర్‌యాదవ్, శ్రీధర్‌చారి, పృథ్వీరాజ్, మెరాజ్ ఖాన్, రామకృష్ణ, రమా మెట్టు కుమార్ యాదవ్, మహిళా నాయకులు పాల్గొన్నారు.