సర్కారు స్కూళ్లకు అన్ని హంగులు
మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి
సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 12 : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యావ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు సబితారెడ్డి, హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలను తలపించే విధంగా ప్రభుత్వ పాఠశాలల రూరరేఖలు మారనున్నట్లు తెలిపారు. తొలి విడుతగా మూడో వంతు పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దీని ద్వారా 60 శాతంపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సమాన నిష్పత్తిలో ఎంపిక చేసి, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే పనులు చేపట్టాలన్నారు. అవసరమైన చోట మరమ్మతు పనులను చేపడుతూ, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, ల్యాబొరేటరీలు, లైబ్రరీ, ప్రహరీ, కిచెన్ షెడ్స్, డైనింగ్‌హాల్, మరుగుదొడ్లు, నీటివసతి, విద్యుత్, ఫర్నిచర్, డిజిటల్ విద్యాబోధనకు సంబంధించిన తదితర పనులను చేపట్టాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రభు త్వ బడులను సందర్శించాలని కలెక్టర్‌కు సూచించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు జడ్పీటీసీలు, గ్రాంథాలయ చైర్మన్ తదితర స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చే ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు, ఇతర దాతలను ప్రోత్సహించాలన్నారు. వారి ఆర్థిక సహకారంతో బడులను మరింత అభివృద్ధి చేసుకోవాలని మంత్రులు స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లాలో 1262 ప్రభుత్వ పాఠశాలలు
సంగారెడ్డి జిల్లాలో 1262 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని కలెక్టర్ హనుమంతరావు మంత్రులకు వివరించారు. మొదటి విడుత కింద 442 పాఠశాలలను ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి గుర్తించామని పేర్కొన్నారు. అందులో 302 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 72 ఉన్నత పాఠశాలలను గుర్తించినట్లు వెల్లడించారు. వారంరోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై వారి భాగస్వామ్యం కోరుతామన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీజైపాల్రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఈవో రాజేశ్ పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో 923 పాఠశాలలు..
మెదక్ జిల్లాలో 923 పాఠశాలలు ఉన్నాయని కలెక్టర్ హరీశ్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్ జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. మొదటి దశలో ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం కింద ఎంపిక చేస్తున్న పాఠశాలల్లో వసతులు, కావాల్సిన సదుపాయాలను గుర్తించి సమగ్ర వివరాలను సేకరించనున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతాగౌడ్, జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్ జిల్లా విధ్యాధికారి రమేశ్ కుమార్, జడ్పీ సీఈవో శైలేశ్ పాల్గొన్నారు.