దక్షిణ భారత దేశంలోనే సంత్ గార్గేబాబా విగ్రహాన్ని మొదటిసారిగా జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణమని, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశాడని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్లో రజకుల ఆత్మ గౌరవసభను ఏర్పాటు చేశారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సంత్ గార్గేబాబా ఆ రోజుల్లోనే స్వచ్ఛ భారత్, పరిశుభ్రతపై ఉద్యమాన్ని నడిపిన మహనీయుడని, మహిళలపై వివక్ష లేని సమాజం కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి గార్గేబాబా అని కొనియాడారు. అలాగే, చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని, ఐలమ్మ గడీల దొరలపై పోరాటం చేసి వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేసిన వీరవనిత ఐలమ్మ అని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్ స్వరాష్ర్టాన్ని సాధించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం ఒక వైపు కొనసాగుతుంటే, మరోవైపు సొంత జాగ ఉండి ఇండ్లు కట్టుకునే నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందజేస్తుందని, ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.
మెదక్‌లో రజకులకు రూ.కోటితో ఫంక్షన్‌హాల్..
మెదక్ పట్టణంలో రజకుల కోసం ఫంక్షన్‌హాల్ కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించి, రూ.కోటితో నిర్మిస్తామన్నారు. ఇందులో రూ.50 లక్షలు మొదటి విడుతగా మంజూరు చేస్తానని, రెండో విడుతలో మరో రూ.50 లక్షలు కేటాయిస్తామన్నారు. జిల్లాలోని రజకుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయమై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని, మీకు న్యాయం జరిగే విధంగా చూస్తానని తెలిపారు. రజకులకు వ్యాపారాలు చేసుకునే విధంగా 80శాతం సబ్సిడీతో రుణాలను మంజూరు చేస్తామని ప్రకటించారు. రజకులకు బీమా కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
6 ఏండ్లల్లోనే 33 మెడికల్ కళాశాలలు..
60 ఏండ్లల్లో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు 3 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే, 6 ఏండ్లల్లో 33 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లకుండా మెదక్ పట్టణంలోనే 550 పకడల దవాఖానను నెలకొల్పుతామని, మెదక్‌కు మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. మెడికల్ కళాశాల వస్తే విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు వస్తాయని, త్వరలో నిధులను మంజూరు చేసి కళాశాలను నిర్మిస్తామన్నారు.
మంత్రికి సన్మానం..
మెదక్‌కు మెడికల్ కళాశాల మంజూరైనందుకు పట్టణంలోని ప్రముఖులు, కుల సంఘాల నాయకులు మంత్రి హరీశ్‌రావును గజమాలతో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ పాలకవర్గం, మార్కెట్ కమిటీ పాలకవర్గం, గౌడ సంఘం నాయకు లు, ఆర్యవైశ్య సభ్యులు, రజక సంఘం నా యకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, నర్సాపూర్ ము న్సిపల్ చైర్మన్ మురళీదర్‌యాదవ్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఎంపీపీ యమున, మున్సిపల్ కౌన్సిలర్లు కిశో ర్, లక్ష్మీనారాయణగౌడ్, విశ్వం, దొంతి లక్ష్మీ, రజక సంఘం జాతీయ కో-ఆర్డినేటర్ మల్లేశ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పల య్య, జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి, నర్సిం లు, లావణ్య, శిరీష, చంద్రశేఖర్, అశోక్, రాజు, టీఆర్ఎస్ నాయకులు, రజక సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
రజక వృత్తి గౌరవప్రదమైనది..
– మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో రజకుల కృషి ఎనలేనిదని, వారి వృత్తి గౌరవ ప్రదమైనదని మెదక్ టీఆర్ఎస్ అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సాధించుకున్న రాష్ట్రం సల్లగుండాలని సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. రజకులు చదువు లో వెనుకబడ్డారని, పిల్లలను చదివించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 91వేల ఉద్యోగాల ప్రకటన చేసిందన్నారు. ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, రజక విద్యార్థినీ, విద్యార్ధులు వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రం అయినందునే మెదక్‌కు మెడికల్ కళాశాల మంజూరైందని, మెడికల్ కళాశాలను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
రజకుల కోసం ఆధునిక ధోబీఘాట్లు..
రాష్ట్ర వ్యాప్తంగా రజకులకు ఆధునీకరమైన ధోబీ ఘాట్లను ప్రభుత్వం నిర్మిస్తుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రం మెదక్‌లో ఆదివారం రూ.కోటి 50 లక్షలతో నిర్మించే ధోబీఘాట్‌కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్డ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు రూ.4.20 కోట్లతో పిల్లికోటల్‌లో నిర్మించే తెలంగాణ గిరిజన బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.45 లక్షలతో మున్సిపల్ కొనుగోలు చేసిన రోడ్డు స్వీపింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అలాగే, పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ, సంత్ గాడ్గే బాబా విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ తరువాత మొదటి దశలో మెదక్‌లో ఆధునిక ధోబీఘాట్‌ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఆధునిక ధోబీఘాట్‌లో బట్టలు ఉతికి ఆరబెటడంతో పాటు ఇస్త్రీ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఆధునిక మాడ్రన్ యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ధోబీఘాట్‌లో రజకులను సకల సౌకర్యాలతో కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు విశాంత్రి గదులను సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణంతో రజకులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ధోబీఘాట్లు తీసుకురావాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆధునిక ధోబీఘాట్లను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.
రాష్ట్రంలోని రజకులకు, నాయీబ్రహ్మణుల కోసం సంవత్సరానికి రూ.300 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. రజకులకు ధోబీఘాట్లే కాకుండా లాండ్రీ దుకాణాలు, నాయీబ్రహ్మణులకు క్షౌర శాలలకు ఉచిత కరెంట్ ఆరు నెలల నుంచి అందజేస్తున్నామన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామని, తండాల అభివృద్ధికి బడ్జెట్లో సీఎం కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు కేటాయించారన్నారు. మరో రూ.600 కోట్లతో తండాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీ భవనాన్ని రూ.25 లక్షలతో ప్రభుత్వం నిర్మించనున్నదని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 2500 గిరిజన గ్రామ పంచాయతీలు ఉన్నాయని మంత్రి చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాలు..
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో రూ.13 కోట్లతో మెదక్ కౌడిపల్లి, తూప్రాన్లలో గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల భవనాలను నిర్మించనున్నామని, ఈరోజు మెదక్‌లో రూ.4.20 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వినతిపై సీఎం కేసీఆర్ మెదక్‌లో గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారన్నారు. గిరిజన విద్యార్థుల కోసం మెదక్‌లో ఎస్ఎంహెచ్ హాస్టల్ (స్టూడెంట్ మెనేజ్మెంట్ హాస్టల్) విద్యార్థి, విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లు మంజూరయ్యాయని వాటి పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.